చట్టాలను వెనక్కి తీసుకుంటేనే ఇళ్లకు తిరిగి వెళ్తాం..

చట్టాలను వెనక్కి తీసుకుంటేనే ఇళ్లకు తిరిగి వెళ్తాం..

Farmer leaders protest during talks with central government : కేంద్రం-రైతుల చర్చల్లో అదే ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎనిమిదో విడత చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేదే లేదని కేంద్రం తేల్చేసింది. అవసరమైతే సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని కేంద్రం భావిస్తోంది. చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు చెబితేనే కొత్త చట్టాలను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేసింది. మరోవైపు… చట్టాలను రద్దు చేసేంత వరకు ఉద్యమం ఆపేదే లేదని రైతులు హెచ్చరించారు. చట్టాలను వెనక్కి తీసుకుంటేనే ఇళ్లకు తిరిగి వెళ్తామని తెగేసి చెబుతున్నారు. విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటామని రైతు సంఘాల నేతలు నినాదాలు చేశారు. భోజన విరామం తీసుకునేందుకు రైతులు నిరాకరించారు. రైతులతో చర్చలు జరుపుతున్న కేంద్ర మంత్రులు సమావేశ స్థలాన్ని వదిలి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

చర్చలకు ముందు వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌- కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక సమావేశం నిర్వహించారు, చర్చల్లో అనుసరించిన వ్యూహాలు, తదుపరి కార్యాచరణపై వీరు చర్చించినట్లు సమాచారం. ఇవాళ్టి చర్చల్లో రైతుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని విశ్వాసంగా ఉన్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరువర్గాలు ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. రైతు సంఘాలు మాత్రం వ్యవసాయ చట్టాలు రద్దు చేసేవరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశాయి.

కేంద్ర తీసుకువచ్చినవ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తుంటే…. రైతు సంఘాలను కేంద్రం చర్చలకు ఎందుకు పిలుస్తుందని రైతు పోరాట సమన్వయ సమితి కో-కన్వీనర్ హన్నన్ మొల్లా ప్రశ్నించారు. రైతులు చలిలో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే… కేంద్ర పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని.. వెంటనే రద్దు చేసి.. పంటలకు మద్దతు ధర కల్పించాలంటూ డిమాండ్‌ చేశారు. చట్టాల్లో ఎలాంటి సవరణలను అంగీకరించబోమని సృష్టం చేశారు.