సోమవారం రైతు లీడర్ల నిరాహార దీక్ష…కర్షకుల కోసం కేజ్రీవాల్ ఉపవాసం

  • Published By: venkaiahnaidu ,Published On : December 13, 2020 / 06:56 PM IST
సోమవారం రైతు లీడర్ల నిరాహార దీక్ష…కర్షకుల కోసం కేజ్రీవాల్ ఉపవాసం

Farmer leaders hunger strike tomorrow నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు 18వ రోజుకు చేరుకున్నాయి. నూతన సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దులో ఎముకలు కొరికే చలిలోనూ అన్నదాతలు ఆందోళన కొనసాగిస్తున్నారు. కాగా, ఆందోళనలను మరింత ఉద్ధృతం చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు.

దేశ రాజధాని ఢిల్లీని కలిపే ముఖ్యమైన హైవేలను ఆదివారం నుంచి బ్లాక్ చేస్తామని, డిసెంబర్ 14 న నిరాహార దీక్షకు దిగనున్నట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు. సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేయనున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. దేశంలోని ప్రతి జిల్లా ప్రధాన కేంద్రంలో ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కొత్త సాగు చట్టాల రద్దును అన్ని సంఘాలు కోరుతున్నాయని పేర్కొన్నారు. రైతు సంఘాలన్నీ కలిసే రేపు ఉద్యమం చేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం దిగిరాకుంటే డిసెంబర్​19న ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామని హెచ్చరించారు.

మరోవైపు, వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలన్న డిమాండ్​తో ఆందోళనలు చేపడుతున్న రైతులకు మద్దతుగా సోమవారం ఉపవాసం ఉండనున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. తన మద్దతుదారులు, ఆప్​ కార్యకర్తలందరూ కూడా రైతన్నలకు మద్దతుగా సోమవారం ఒక్కరోజు నిరాహార దీక్ష చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం అహంకారాన్ని వీడి తక్షణమే మూడు చట్టాలు రద్దు చేయాలని… రైతుల డిమాండ్లు అన్నింటికీ అంగీకరించాలని కేజ్రీవాల్ సూచించారు.

కాగా, ఢిల్లీ సరిహద్దులో ఆందోళనలు చేస్తున్న రైతులకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. అన్నదాతల నిరసనకు మద్దతుగా పంజాబ్​ డీఐజీ(జైళ్లు) లక్మీందర్​ సింగ్​ తన పదవికి రాజీనామా చేశారు. ముందస్తుగా పదవీ విరమణ చేస్తున్నట్లు భావించాలని కోరుతూ పంజాబ్ ప్రభుత్వ కార్యదర్శికి లేఖ పంపారు. రైతులకు సంఘీభావంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.