రైతుల ఆందోళనలు..కేంద్రం ప్రతిపాదనలు

  • Published By: madhu ,Published On : December 9, 2020 / 06:16 AM IST
రైతుల ఆందోళనలు..కేంద్రం ప్రతిపాదనలు

రైతుల ఆందోళనతో కేంద్ర ప్రభుత్వం దిగివస్తోంది. రైతు సంఘాలతో 2020, డిసెంబర్ 08వ తేదీ మంగళవారం అర్ధరాత్రి వరకూ హోంశాఖ మంత్రి అమిత్ షా చర్చలు జరిపారు. రైతుల డిమాండ్లకు సంబంధించి రాత పూర్వకంగా బుధవారం కొన్ని ప్రతిపాదనలు పంపిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే కొత్త చట్టాలను మాత్రం వెనక్కి తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా లేదని తెలుస్తోంది. ఇక కేంద్రం – రైతు సంఘాల మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి.

కేంద్రం ప్రతిపాదనలు..రైతు సంఘాలు చర్చలు :-
ఇటు కేంద్రం పంపే ప్రతిపాదనలపై బుధవారం అన్ని రైతు సంఘాలు చర్చించి నిర్ణయం తీసుకోనున్నాయి. ప్రతిపాదనలు అందిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆల్ ఇండియా కిసాన్ సభ పేర్కొంది. మంగళవారం దేశ వ్యాప్తంగా బంద్‌కు రైతు సంఘాలు పులుపునివ్వడం, అన్ని పార్టీలు, నేతలు, ప్రజలు సపోర్ట్ చేయడంతో కేంద్రం ఒక రోజు ముందుగానే రైతులను చర్చలకు ఆహ్వానించింది.
తాజాగా ప్రభుత్వం పంపనున్న ప్రతిపాదనలకు రైతులు అంగీకరిస్తే బుధవారం జరగనున్న కేబినెట్‌ భేటీలో రైతులకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైతుల పంటలకు మద్దతు ధరకు లిఖిత పూర్వక హామీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ మార్కెట్ వ్యవస్థ బలోపేతం, కాంట్రాక్టు వ్యవసాయం అంశంలో రైతులు సివిల్‌ కోర్టులకు వెల్లేందుకు అనుమతి సహా పలు రైతు డిమాండ్లకు ఒప్పుకునే అవకాశాలున్నాయి.

రాష్ట్రపతిని కలువనున్న విపక్ష నేతల బృందం :-
మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న విపక్ష నేతల బృందం 2020, డిసెంబర్ 09వ తేదీ బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో భేటీ కానుంది. వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళన, దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలను రాష్ట్రపతికి వివరించనున్నారు. సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలుసుకోనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఎన్‌సీపీ చీఫ్ శరద్‌ పవార్‌ తదితర 24 పార్టీలకు చెందిన నేతలు రాష్ట్రపతిని కలుకునేందుకు అనుమతిని కోరారు. అయితే కోవిడ్-19 ప్రోటోకాల్‌ దృష్ట్యా కేవలం ఐదుగురు నేతలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు కలిగే నష్టాలను విపక్షాలు రాష్ట్రపతికి వివరించనున్నాయి. రైతు ఆందోళనకు సంబంధించి విజ్ఞాపణ పత్రాన్ని అందించనున్నాయి.