ఆజాద్ మైదాన్ కి పోటెత్తిన అన్నదాతలు

ఆజాద్ మైదాన్ కి పోటెత్తిన అన్నదాతలు

Farmer Protests నూతన వ్యవసాయ చట్టాలకు వ‌్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా సోమవారం(జనవరి-25,2021) ముంబైలోని ఆజాద్‌ మైదానంలో నిర్వహిస్తున్న సభకు రైతులు పోటెత్తారు. మహారాష్ట్ర నలుమూలల నుంచి సభకు రైతులు భారీగా తరలివచ్చారు. మహారాష్ట్రలోని 21 జిల్లాల నుంచి దాదాపు 10 వేల మంది రైతులు ఇప్పటికే ఆజాద్ మైదానానికి చేరుకున్నారు.

ఈ రోజు ర్యాలీగా తరలివెళ్లి మహారాష్ట్ర గవర్నర్‌కు వినతిపత్రం ఇస్తామని రైతు సంఘం నేతలు తెలిపారు. కుటుంబ సమేతంగా ముంబైకి తరలివచ్చామని.. వ్యవసాయం లేకపోతే తామంతా రోడ్డుపై పడాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. నేడు నిర్వహించే సభలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా.. మహారాష్ట్ర అధికార కూటమి మహా వికాస్ అఘాడీకి చెందిన ప్రముఖ నేతలు పాల్గొననున్నారు.

మరోవైపు, మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ..కొన్ని పార్టీలు రైతుల మద్దతు లేకుండా తప్పుదారి పట్టిస్తూ ఆందోళనకు ప్రయత్నిస్తున్నాయి. 2006 లో కాంట్రాక్ట్ వ్యవసాయానికి ఎన్సీపీ అనుమతి ఇచ్చిందని నేను కాంగ్రెస్‌ను అడగాలనుకుంటున్నాను. రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవసాయం చేయడం సరైంది.. కేంద్రం అదే తెచ్చినప్పుడు తప్పు. ఇది ఏ డబుల్ స్టాండర్డ్? అని ఫడ్నవీస్ ప్రశ్నించారు.

ఇక,ముంబైలో రైతుల మార్చ్ అవసరం లేదని సోమవారం కేంద్రమంత్రి రామ్ థాస్ అథవాలే అన్నారు. కేవలం పబ్లిసిటీ కోసం రైతులు ఆందోళన చేస్తున్నారన్నారు. కేంద్రం రైతుల వైపే ఉందని,వారికి న్యాయం చేసేందుకు కట్టుబడి ఉందని తెలిపారు.