Punganur : పుంగనూరు జాతి పశుపోషణకు రైతుల మక్కువ

చిత్తూరు జిల్లాలో కొండ ప్రాంతాల్లో అధికంగా కనిపించే ఈ ఆవులు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మచ్చుకైనా కనిపించని పరిస్ధితి ఏర్పడింది.

Punganur : పుంగనూరు జాతి పశుపోషణకు రైతుల మక్కువ

Punganur Cows (1)

Punganur : చిట్టిపొట్టి ఆకారంతో అందంగా, ఆకర్షనీయంగా కనిపించే పుంగనూరు ఆవులు చూపరులను ఇట్టే కట్టిపడేస్తాయి. పాల దిగుబడి తక్కువే అయినా మేత ఖర్చు ఎక్కవగా ఉండదు. ఒకప్పుడు చిత్తూరు జిల్లాలో అధికంగా కనిపించే ఈ నాటు ఆవులు క్రమేపి అంతరించే పోయే దశకు చేరుకున్నాయి. కొందరు రైతులు పుంగనూరు జాతి సంరక్షణలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. పుంగనూరు ఆవు ఇంట్లో ఉంటే శుభం జనుగుతుందన్న నమ్మకంతో చాలా మంది వాటిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంది. ఒక్కో ఆవు ధర ప్రస్తుతం లక్ష రూపాయల వరకు పలుకు తుంది.

వ్యవసాయంలో అనాధిగా రైతులకు అండదండగా నిలిచే పరిశ్రమగా పశుపోషణ ఉంది. ఒకప్పుడు దేశీయజాతి పశువులతో రైతుల లోగిళ్ళు కళకళ లాడుతూ పాడి పుష్కలంగా లభించేది. మారిన ఆధునిక పోకడల వల్ల రైతులు ప్రతి విషయంలోను లాభనష్టాలను భేరీజు వేసుకోవాల్సి వస్తుంది. దీంతో దేశీయ జాతి ఆవుల పోషణకు దూరమై సంకరజాతి ఆవుల పోషణవైపు రైతులు మొగ్గు చూపాల్సి వచ్చింది. ఈ కారణంగా దేశీయజాతి ఆవులు అంతరించి పోయే దశకు చేరుకున్నాయి. వీటిలో పుంగనూరు జాతి ఆవులు కూడా ఉన్నాయి.

చిత్తూరు జిల్లాలో కొండ ప్రాంతాల్లో అధికంగా కనిపించే ఈ ఆవులు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మచ్చుకైనా కనిపించని పరిస్ధితి ఏర్పడింది. అయితే ఈ జాతి ఆవశ్యకతను గుర్తించిన కొందరు రైతులు వాటి పోషణకు శ్రీకారం చుడుతున్నారు. పుంగనూరు ఆవులు కాళ్లు పొట్టిగా ఉండి, ఎత్తు 70 నుంచి 90 సెంటీమీటర్లు ఉంటుంది. ఇవి 2 అడుగుల 4 అంగుళాల నుంచి 3 అడుగుల వరకు ఎత్తు పెరుగుతాయి. ఇవి 100 నుంచి150 కిలోల బరువు ఉంటాయి. ఈ ఆవు పాలలో 8 శాతం కొవ్వు ఉండి, ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. ఈ రకం జాతి ఆవులు ఎక్కువగా బూడిద, తెలుపు రంగుల్లో ఉంటాయి. విశాలమైన నుదురు, చిన్న కొమ్ములు వీటి ప్రత్యేకత కాగా, తోక మాత్రం నేలను తాకుతూ చూపరులని ఇట్టే ఆకర్షిస్తుంది.

ఈ రకం జాతి ఆవులను పెంపకం చాలా సులువైందిగా చెప్తున్నారు పుంగనూరు వాసులు. సాధారణ ఒక ఆవుని పోషించే బదులు 10 పుంగనూరు జాతి గోవుల్ని  పెంచవచ్చు. వీటికి కావాల్సిన దాణా పరిమాణం కూడా తక్కువే. రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకోగలవు. దూడల మరణశాతం చాలా తక్కువగా ఉంటుందని. ఎలాంటి రోగాలకు గురికాకుండా రోగనిరోధక శక్తికూడా వీటిలో అధికంగా ఉంటుందని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. సంకర జాతీ ఆవులతో పోలిస్తే పోషణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కో ఆవు నుండి రోజుకు 4లీటర్ల వరకు పాలిస్తాయి, ఈ ఆవు పాలు లీటరు 100 రూపాయలు వరకు పలుకుతుంది.

ఈ ఆవులలో పాల దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ వీటి పేడ, మూత్రాన్ని మార్కెటింగ్ చేసుకోగలిగితే లాభసాటిగా ఉంటుంది. కోడెల పొట్టిగా ఉన్నా బాగా బలిష్టంగా ఉండటంతో వీటిని వ్యవసాయ పనులకు వినియోగించవచ్చు. రోజుకు 5 కిలోల పచ్చిగడ్డిని తింటుంది. ఎంత కరువు పరిస్థితులు ఎదురైనా తట్టుకుని జీవించగలవు.