రైతులు చేపట్టిన భారత్ బంద్ నాలుగు గంటలే

  • Published By: murthy ,Published On : December 7, 2020 / 06:06 PM IST
రైతులు చేపట్టిన భారత్ బంద్ నాలుగు గంటలే

farmers bharat bandh 4 hours only : కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ డిసెంబర్ 8న రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్ నాలుగు గంటలు మాత్రమే నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు చేస్తున్న ఆందోళన 12 వ రోజుకు చేరింది.

ఎముకలు కొరికే చలిలో వారి ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. మంగళవారం నాటి బంద్ కు 14 రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటింటాయి. కాగా రైతులు ఆందోళన చేస్తున్న సింఘూ ప్రాంతాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సందర్శించారు. నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు అక్కడ ఎలాంటి వసతులు ఉన్నాయో పర్యవేక్షించారు. సీఎంతో పాటు మంత్రులు కూడా రైతులను పరామర్శించారు.



కేంద్ర ప్రభుత్వం తో ఐదు సార్లు జరిపిన చర్చలు విఫలం కావటంతో రైతు సంఘాలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలుగకుండా ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు నిర్వహిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ ప్రకటించారు. తాము బంద్‌ను ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తామని, తమ తమ విధుల నిమిత్తం కార్యాలయాలకు వెళ్లే వారు నిరభ్యంతరంగా వెళ్లవచ్చని, ఆ తర్వాత 3 గంటలకు బంద్‌ను ముగిస్తామని, ఆ సమయంలో కార్యాలయాలు కూడా ముగుస్తాయని వెల్లడించారు.



ఇక, అత్యవసర సర్వీసులైన అంబులెన్స్‌లు, పెళ్లిళ్లు యథావిథిగానే కొనసాగుతాయని పేర్కొన్న ఆయన.. తమ నిరసనను శాంతియుతంగా కొనసాగిస్తామని, తమ నిరసన వ్యక్తం చేయడానికి దీనిని ఓ పద్ధతిగా మాత్రమే ఎంచుకున్నట్లు స్పష్టం చేశారు.