రైతుల రైల్ రోకో, భారీగా పోలీసుల బందోబస్తు

రైతుల రైల్ రోకో, భారీగా పోలీసుల బందోబస్తు

nationwide ‘rail roko’ : మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రైలురోకో నిర్వహిస్తున్నారు. 2021, ఫిబ్రవరి 18వ తేదీ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు రైల్‌రోకో ప్రారంభం కావల్సి ఉన్నా షెడ్యూల్ టైం కన్నా ముందుగానే రైళ్లను అడ్డుకుంటున్నారు రైతులు. సాయంత్రం నాలుగు గంటల వరకు దేశవ్యాప్తంగా రైల్‌ రోకో జరగనుంది. రైలో రోకో శాంతియుతంగా జరుగుతుందని రైతులు తెలిపారు. రైల్ రోకో కారణంగా నిలిచిపోయిన ప్రయాణికులకు నీరు, పాలు, లస్సీ, పండ్లు అందిస్తామని తెలిపారు. రైతు సమస్యలను ప్రజలకు తెలియజేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని రాకేశ్ టికాయత్ తెలిపారు.

సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతన్నల ఉద్యమం ఉధృతమవుతోంది. నాలుగు గంటలపాటు శాంతియుతంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన తెలపాలని రైతు సంఘాల నేతలు కోరారు. సాగు చట్టాలను రద్దు చేసే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని రైతు నేతలు పునరుద్ఘాటించారు. రైతులు రైల్‌రోకోకు పిలుపు నివ్వడంతో పోలీసులు, రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. పంజాబ్‌, హర్యానా, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌లో ముందస్తు జాగ్రత్తగా 20 అదనపు ఆర్‌పీఎస్‌ఎఫ్‌ కంపెనీలను మోహరించారు. రైల్‌రోకో సందర్భంగా నిరసనకారులు సంయమనంతో వ్యవహరించాలని రైల్వే అధికారులు కోరారు.

ఇంటలిజెన్స్‌ నివేదికల అనుగుణంగా పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్,‌ పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలపై దృష్టి సారించామని… ఇందుకోసం 20 వేల అదనపు సిబ్బందిని ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉంచుతామని రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌ కుమార్‌ వెల్లడించారు. ఆందోళనలో ప్రతిఒక్కరూ శాంతియుతంగా ఉండాలని అరుణ్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు.