అన్నదాతల ఆగ్రహం…8న భారత్ బంద్

అన్నదాతల ఆగ్రహం…8న భారత్ బంద్

Farmers Call For ‘All-India Bandh’ On Tuesday వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా,విద్యుత్ బిల్లు 2020 ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తొమ్మిది రోజులుగా దేశ రాజధానిలో రైతులు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం పలు దఫాలుగా రైతులతో జరిపిన చర్చలు ఓ కొలిక్కిరాని నేపథ్యంలో నూతన అగ్రి చట్టాలను కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ తో డిసెంబర్​ 8న భారత్​ బంద్​ కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు.



మంగళవారం(డిసెంబర్-8,2020) భారత్ బంద్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న హైవే టోల్ గేట్ ల వద్ద తాము నిరసనలు చేస్తామని,ప్రభుత్వం టోల్ ఛార్జీలు వసూలు చేయకుండా అడ్డుకుంటామని భారతీయ కిసాన్​ యూనియన్​ ప్రధాన కార్యదర్శి హెచ్​ఎస్​ లాఖోవాల్​ తెలిపారు. తమ ఆందోళన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనబోతున్నారని తెలిపారు. అదేవిధంగా శనివారం(డిసెంబర్​ 5,2020) దేశవ్యాప్తంగా ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు రైతు నేతలు వెల్లడించారు.



మరోవైపు, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్రం చర్చలు కొలిక్కిరావట్లేదు. గురువారం ఏడు గంటల పాటు చర్చలు జరిగినా ఎటూ తేలలేదు. అయితే ఈ అంశంపై నిర్ణయం తేలకపోవడం వల్ల శనివారం మరోమారు భేటీ కానున్నారు. చర్చలను శనివారానికి వాయిదా వేయడంతో హస్తిన సరిహద్దుల్లో అన్నదాతల నిరసన కొనసాగుతూనే ఉంది. వరుసగా 9వ రోజు ఢిల్లీ-హరియాణా మార్గంలోని సింఘు, టిక్రి రహదారులపై బైఠాయించిన రైతులు శాంతియుతంగా నిరసన సాగిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసుల మోహరింపు కూడా కొనసాగుతోంది.



రైతుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ వాసులకు ట్రాఫిక్‌ కష్టాలు ఎదురయ్యాయి. శుక్రవారం కూడా సింఘు, టిక్రి, లాంపూర్‌,సఫియాబాద్‌, సబోలి తదితర సరిహద్దులను పోలీసులు మూసివేశారు. 44వ జాతియరహదారికి రెండువైపులా రాకపోకలను నిషేధించారు. ఝతికరా సరిహద్దులో కేవలం ద్విచక్రవాహనాలకు మాత్రమే అనుమతి కల్పించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు. అయితే ప్రత్యామ్నాయ మార్గాలతో దూరం పెరగడమేగాక, రద్దీ కూడా విపరీతంగా ఉంటుండటంతో గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. దీంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు ఢిల్లీ-యూపీ మార్గాన్ని కూడా రైతులు నిర్బంధించారు.



కాగా,ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న రైతులను తరలించాలని ఢిల్లీ వాసి రిషబ్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. దేశ రాజధానిలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో పెద్దఎత్తున రైతులు గుమికూడటం కోరడం ప్రమాదకరమన్న పిటిషన్ ​దారు రైతులను అనుమతిచ్చిన మైదానానికి తరలించాలని తన పిటిషన్ లో కోరారు. మైదానంలో కరోనా నిబంధనలు పాటించేలా చూడాలన్న పిటిషనర్ రిషబ్ ​ఢిల్లీ సరిహద్దుల్లోని రహదారులను తెరవాలని పేర్కొన్నారు.