Lakhimpur Kheri..మరణించిన రైతు కుటుంబాలకు రూ. 45లక్షల పరిహారం,ప్రభుత్వ ఉద్యోగం
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని లఖిమ్‌పూర్ ఖేరీ జిల్లాలోని టికునియాలో ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ.45 లక్షల

Lakhimpur Kheri ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని లఖిమ్‌పూర్ ఖేరీ జిల్లాలోని టికునియాలో ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ.45 లక్షల ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తుందని ఏడీజీ(శాంతిభద్రతలు) ప్రశాంత్ కుమార్ సోమవారం తెలిపారు. ఆదివారం నాటి ఘటనలో గాయపడిన వారికి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు.
హింసాత్మక ఘటనలపై రైతుల ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పిన ఏడీజీ ప్రశాంత్ కుమార్..ఘటనపై రిటైర్డ్ హైకోర్టు జడ్జితో విచారణ చేయించనున్నట్లు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉందని లఖిమ్‌పూర్ ఖేరీ జిల్లాలో పర్యటించేందుకు రాజకీయ పార్టీల నేతలకు అనుమతి లేదని ప్రశాంత్ కుమార్ తెలిపారు. అయితే రైతు సంఘాల సభ్యులు మాత్రం జిల్లాలో పర్యటించేందుకు అనుమతిస్తున్నట్లు చెప్పారు.
ఇక,ఈ రోజు ఉదయం పోలీసులతో సమావేశం తర్వాత నలుగురి రైతుల మృతదేహాలను దహనం చేయడానికి రైతులు అంగీకరించారు. ఇక,ఆదివారం నుంచి రైతుల మరణాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులు..పోలీసులతో సమావేశం తర్వాత తమ ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు.
మరోవైపు.. హింసలో మరణించిన బీజేపీ కార్యకర్తల కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర డిమాండ్ చేశారు. ఘటనపై సీబీఐ, సిట్ లేదా సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలన్నారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. బీజేపీ కార్యకర్తలపై కర్రలు, కత్తులతో దాడి చేశారని.. అక్కడే ఉన్నట్లేతే.. తను కుమారుడు కూడా మరణించేవాడినని మిశ్రా అన్నారు.
ఆదివారం ఏం జరిగింది
లఖిమ్‌పూర్ ఖేరీ జిల్లాలోని టికునియా గ్రామంలో కేంద్ర సహాయమంత్రి అజయ్ మిశ్రా, ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య ఆదివారం ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే వీరి పర్యటనను వ్యతిరేకిస్తూ టికునియా-బందిర్పూర్ రోడ్డుపై రైతులు నల్లజెండాలతో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి,డిప్యూటీ సీఎం ప్రయాణిస్తున్న కాన్వాయ్ రోడ్డు పక్కనే ఆందోళన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. రైతులు నిరసన వ్యక్తం చేస్తుండగా.. రెండు ఎస్యూవీ వాహనాలు వారిని ఢీకొట్టాయి. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించారు.
నిరసన చేస్తున్న అన్నదాతలపైకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్ర కారుతో పాటు మరో వాహనం దూసుకెళ్లడం వల్లే రైతులు మరణించినట్లు తెలుస్తోంది. రైతులపైకి కారు ఎక్కించిన కేంద్ర మంత్రి కుమారుడిని అదుపులోకి తీసుకోవాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. ఓ పోలీసు,ముగ్గురు బీజేపీ కార్యకర్తలను కొట్టి చంపారు రైతులు. ఇక, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్రాపై హత్య కేసు నమోదైంది. ఆయనతోపాటు 13 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
9కి చేరిన మృతుల సంఖ్య
రైతులు, అధికార వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మరణించినవారి సంఖ్య 9కి చేరింది. ఆదివారం నాటి ఘర్షణలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్టు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. మరోవైపు,లఖిమ్‌పూర్ ఖేరీ ఘటనకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలు దేశ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసనకు రైతు సంఘాలు పిలుపు ఇచ్చాయి.
భారీ భద్రత నడుమ
ప్రస్తుతం లఖీంపూర్ ఖేరీలో పరిస్థితి ఉద్రిక్తతగా ఉంది. ముందు జాగ్రత్త చర్యగా ఇంటర్నెట్ నిలిపివేశారు. భారీ సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి. రాజకీయ నేతలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఘటన జరిగినటికునియా గ్రామం చుట్టూ భారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంకు వెళ్లేందుకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రయత్నించడంతో సీతాపూర్ వద్ద పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
ALSO READ హౌస్ అరెస్టు చేసిన గదిని ఊడ్చిన ప్రియాంక గాంధీ
ALSO READ కేంద్రమంత్రి కొడుకుపై మర్డర్ కేసు