వెనక్కి తగ్గమంటున్న రైతులు, చక్కాజామ్..జాతీయ రహదారుల దిగ్బందం

వెనక్కి తగ్గమంటున్న రైతులు, చక్కాజామ్..జాతీయ రహదారుల దిగ్బందం

Farmers Chakkajam : రైతుల ఆందోళన మరింత ఉధృతమవుతోంది. దేశవ్యాప్తంగా ఇవాళ చక్కాజామ్‌ పేరుతో జాతీయ రహదారుల్ని దిగ్బంధనం చేయనున్నారు. రిపబ్లిక్‌ డే ట్రాక్టర్ పరేడ్‌ తర్వాత కేంద్రం రైతుల ఆందోళనపై ఉక్కుపాదం మోపడంతో రైతు సంఘాలు చక్కాజామ్‌కు పిలుపునిచ్చాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. శనివారం దేశవ్యాప్తంగా రైతులు చక్కాజామ్‌ ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను మినహాయించి దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను దిగ్బంధిస్తారు.

మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు చక్కా జామ్‌ ఆందోళన కొనసాగుతుంది. 3 గంటల ఆందోళన ముగియగానే ఆందోళనకారులు నిముషం పాటు వాహనాల హారన్‌ మోగిస్తారని రైతు సంఘాలు పేర్కొన్నాయి. మరోవైపు ఢిల్లీ సరిహద్దులో రైతులు ఎప్పటిలానే బైఠాయించనున్నారు. ఇంటర్నెట్‌పై నిషేధం విధించడంతో సరిహద్దులోని రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరోవైపు..వ్యవసాయ చట్టాలపై రాజ్యసభలో వాడివేడి చర్చ జరిగింది. రైతులకు నష్టం కలిగేలా ఉన్న సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. సాగు చట్టాలు సరైనవే అంటూ వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ విపక్షాలపై ఎదురు దాడి చేశారు. రైతుల ఆందోళన కేవలం ఒకరాష్ట్రానికే పరిమితమన్నారు. కొందరు రైతులను తప్పుదోవపట్టించి రెచ్చగెడుతున్నారని విమర్శించారు.

వ్యవసాయ చట్టాల్లో సవరణలకు ఒప్పుకున్నామంటే అందులో లోపాలు ఉన్నట్లు కాదని స్పష్టం చేశారు. కాంట్రాక్ట్‌ వ్యవసాయంలో రైతుల భూమిని ఎవరూ లాక్కోరని…ఆ తరహా నిబంధనలు చట్టంలో లేవన్నారు తోమర్. రైతుల చక్కా జామ్‌ నేపథ్యంలో ఢిల్లీతో పాటు చుట్టు పక్కల రాష్ట్రాల పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. రిపబ్లిక్‌ డే ట్రాక్టర్‌ మార్చ్ ఘటనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్దితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు.