Lakhimpur Violence : రైతు హత్యలను ఖండించాల్సిందే..లఖింపూర్ ఘటనపై ఆర్థికమంత్రి కీలక వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఖండించారు.

Lakhimpur Violence : రైతు హత్యలను ఖండించాల్సిందే..లఖింపూర్ ఘటనపై ఆర్థికమంత్రి కీలక వ్యాఖ్యలు

Nirmala

Lakhimpur Violence   దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఖండించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆర్థికమంత్రి మంగళవారం మసాచుసెట్స్ రాష్ట్రంలోని హార్వార్డ్ కెన్నడీ స్కూలులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అక్కడి విద్యార్ధులతో సంభాషణ సమయంలో లఖింపూర్ ఘటనపై ప్రధాని మోదీ, ఇతర మంత్రులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఆత్మరక్షణ పంథాలో ఎందుకు వ్యవహరిస్తాన్నారు? అంటూ అడిగిన ప్రశ్నకు..అలాంటిదేమీ లేదు అని నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు. ఇలాంటి హింసాత్మక ఘటనలను ఎవరైనా ఖండించాల్సిందేనని అన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ ఖండిస్తారని, అందరి అభిప్రాయమూ ఒకేలా ఉంటుందని అన్నారు.

అయితే, ఈ తరహా ఘటనలు ఒక ప్రాంతానికే పరిమితమై ఉండవని, దేశ‌వ్యాప్తంగా ఎక్క‌డ ఇలాంటివి జ‌రిగినా వాటిని లేవ‌నెత్తాల‌ని మీతో పాటు డాక్ట‌ర్ అమ‌ర్త్య సేన్ వంటి వారిని తాను కోరుతున్నాన‌ని ఆమె పేర్కొన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో జరిగినప్పుడే సమస్యగా చిత్రీకరించ కూడదని అన్నారు. లఖింపూర్ తరహా ఘటనలు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే జరగడం లేదని పేర్కొన్నారు. లఖింపూర్ ఘటనలో తన క్యాబినెట్ సహచరుని కుమారుడికి చిక్కులు ఎదురయ్యాయని, అందులో ఆయన ప్రమేయం ఉందా లేదా అనేది కూడా విచారణలో తేలిన తర్వాతే తగిన న్యాయం జరుగుతుందని ఆర్థికమంత్రి అన్నారు.

కాగా, అకోబరు 3,2021న లఖింపూర్‌ ఖేరి జిల్లాలోని టికోనియా-బన్బీపుర్‌ రహదారిపై నూత వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న రైతులపైకి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రా తనయుడు ఆశిష్‌ మిశ్రా కారు, మరో వాహనం దూసుకెళ్లాయి. ఈ ఘటనలో నలుగురు రైతులు అక్కడికక్కడే మరణించగా.. అనంతరం జరిగిన హింసలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దేశ‌వ్యాప్తంగా క‌ల‌కలం రేపిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఇప్పటికే ఆశిష్‌ మిశ్రాను ఉత్తర్​ప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు బీజేపీ కార్యకర్తలను కూడా ఈ కేసుకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఇక,నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తోన్న నిరసనలపై అడిగిన ప్రశ్నకు..దశాబ్దానికి పైగా వివిధ పార్లమెంటరీ కమిటీలతో చర్చలు జరిపిన తర్వాతే మూడు సాగు చట్టాలను తీసుకు వచ్చామని నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వాలతో విస్తృతంగా చర్చలు జరిపామని అన్నారు. ప్రతి ఒక్క భాగస్వామితోనూ చర్చించే చట్టాలు తెచ్చామని చెప్పారు.

పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లోనే రైతు నిరసనలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఫలానా పాయింట్ అంటూ ఇంతవరకూ స్పష్టంగానిరసనకారులు చెప్పడం లేదని, కనీస మద్దతు ధర అనే అంశం తీసుకుంటే ఎంఎస్‌పీ ప్రకటిస్తూనే ఉన్నామని చెప్పారు. ఫలానా విషయంపై నిరసన చేస్తున్నామని వారు చెప్పనప్పటికీ ఈ రోజుటికి కూడా చర్చలకు తాము సుముఖంగానే ఉన్నట్లు సృష్టం చేశారు.

ALSO READ Lakhimpur Violence : కేంద్రమంత్రిని డిస్మిస్ చేయాలన్న కాంగ్రెస్..ప్రభుత్వంతో మాట్లాడతానన్న రాష్ట్రపతి

ALSO READ  స్మూత్‌గా నడుస్తున్న ఎలక్ట్రిక్ కార్లు.. భారీగా పెరిగిన డిమాండ్.. రూ.15లక్షల్లోపు బడ్జెట్‌లో!