నెవ్వర్ బిఫోర్.. రగులుతున్న రైతులు.. నేడే భారత్ బంద్

  • Published By: vamsi ,Published On : December 8, 2020 / 08:07 AM IST
నెవ్వర్ బిఫోర్.. రగులుతున్న రైతులు.. నేడే భారత్ బంద్

అన్నం పెట్టే రైతు ప్రజలు ఇబ్బంది పెట్టాలని అనుకుంటారా? అందుకే విభిన్నంగా ప్రజలకు ఇబ్బందులు పడకుండా.. నెవ్వర్ బిఫోర్ బంద్‌లా నిర్వహించాలని రైతులు నిర్ణయించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రగిలిపోతున్న రైతులు.. దేశవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా రైతులు భారత్ బంద్‌‌ను ఇవాళ(డిసెంబర్ 8) నిర్వహిస్తుండగా.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బంద్ జరపాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. సాయంత్రం 4 గంటల తర్వాత యధావిధిగా పనులు జరుపుకోవాలని కోరాయి.



రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు తెలంగాణ ప్రభుత్వం మద్దతు పలికింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా భారత్ బంద్ పాటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పిలుపునిచ్చారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు టీ కాంగ్రెస్ పార్టీ కూడా భారత్ బంద్‌కు మద్దతు పలికింది. బంద్‌లో మంత్రులు కూడా పాల్గొననున్నారు. షాద్ నగర్ హైవే మీద కేటీఆర్, సిద్దిపేటలో హరీశ్ రావు బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. రేపు సంగారెడ్డి హైవే దిగ్బంధిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు.



దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు దాదాపుగా ఈ బంద్‌కు మద్దతు తెలిపాయి. శాంతిభద్రతల పరిస్థితి కొనసాస్తూ.. ఎక్కడా హింస లేకుండా.. అవాంతరాలు జరగకుండా చూసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. దేశవ్యాప్త బంద్ దృష్ట్యా, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు సలహాలు, సూచనలు ఇచ్చింది. భారత్ బంద్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో? రైతులు, ప్రతిపక్ష పార్టీలు బంద్‌కు ఎలా సిద్ధమవుతున్నాయో? ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయి.



ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లొచ్చు:
భారత్ బంద్ కింద ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే బంద్ పాటించాలని, ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి రావడానికి రైతులు సహకరించాలని, సాధారణంగా ప్రజలు ఉదయం 11 గంటలలోపే ఆఫీసులకు వెళ్తారని, మధ్యాహ్నం 3 నుంచి ఇంటికి వచ్చే పరిస్థితి ఉంటుంది అని, ఈ మధ్యలోనే భారత్ మొత్తం బంద్ నిర్వహించాలని రైతులు కోరుతున్నారు.



మధ్యాహ్నం తర్వాత దుకాణాలు:
వ్యాపారాలు, దుకాణాలు నిర్వహించేవారు.. రైతులకు మద్దతుగా మధ్యాహ్నం వరకు కచ్చితంగా మూసివెయ్యాలని రైతులు అభ్యర్థించారు. ప్రశాంతమైన భారతదేశం బంద్ కోసం నాలుగు గంటలు కేటాయించాలని, భోజనం చేసిన తర్వాతే దుకాణాలను తెరవాలని దుకాణదారులనుయ కోరుతున్నారు రైతులు. నాలుగు గంటలలో రైతులు కోసం హింస చేయకూడదు అని రైతులు పిలుపునిచ్చారు.



ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు:
ఉద్యోగులు యథావిధిగా తమ కార్యాలయాలకు వెళ్లనివ్వాలని వారి విధులకు ఆటంకం కలగనివ్వవద్దని, ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు రైతులు. అలాగే అంబులెన్సులు మరియు వివాహ వేడుకలకు హాజరు కావడానికి వెళ్తున్న ప్రజలు.. వాహనాలకు అంతరాయం కలిగించకుండా ప్రదర్శనలు శాంతియుతంగా చేయాలని, ప్రజలను ఇబ్బంది పెట్టేవాడు రైతు కాదు అని రైతులే అంటున్నారు.



జెండాల్లేకుండా ఎజెండాతోనే విధుల్లోకి:
దేశవ్యాప్తంగా రైతులకు దాదాపుగా అన్నీ రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించగా.. రాజకీయనాయకులు రాజకీయ పార్టీల జెండాలను తీసుకుని విధుల్లోకి రాకూండా.. కేవలం రైతులకు మద్దతుగా పార్టీ జెండాలు లేకుండా వీధుల్లోకి రావాలని రైతులు కోరుతున్నారు. రాజకీయ పార్టీ నాయకులకు బంద్‌కు నాయకత్వం వహించే బాధ్యత ఇవ్వకూడదని కోరాయి రైతు సంఘాలు.



రాష్ట్రాలకు మార్గదర్శకాలను ఇస్తున్న కేంద్రం:
‘భారత్ బంద్’ సందర్భంగా హింస జరగకూడదని కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా ఉంది. మంగళవారం ‘భారత్ బంద్’ సందర్భంగా భద్రతను కఠినతరం చేసింది. ప్రతిచోటా శాంతిని నెలకొల్పాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సలహాలు, సూచనులు ఇచ్చింది. అంతే కాదు, కరోనా నేపథ్యంలో మార్గదర్శకాలను కఠినంగా పాటించాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది.



ఎనిమిది రాష్ట్రాలు మద్దతు:
రైతులు నిర్వహిస్తున్న బంద్‌కు ఎనిమిది రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ఇవ్వగా.. ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర ప్రభుత్వాలు అందులో ఉన్నాయి. రైతుల డిమాండ్లకు మమతా బెనర్జీ మద్దతు ఇచ్చినప్పటికీ భారత్ బంద్‌కు మద్దతు ఇవ్వలేదు. రైతులు ఈ భారత్ బంద్‌కు కాంగ్రెస్, NCP, CPI(M), SP, BSP, శివసేన, నేషనల్ కాంగ్రెస్, PDP, RJD, DMK, ఎంఎన్‌ఎంఎ, CPI, టిఆర్‌ఎస్, గుప్కర్ అలయన్స్, ఆమ్ ఆద్మీ పార్టీల మద్దతు ఉంది. ఈ షట్‌డౌన్ ప్రభావం డిసెంబర్ 9 చర్చలపై పడిపోతుందని భావిస్తున్నారు రైతులు. బంద్‌ను విజయవంతం చేయాలని రైతులు పట్టుబట్టడానికి ఇదే కారణం.



ఇక బంద్ సందర్భంగా అవసరమైన సేవలను ఆపి బలవంతం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. నిరసన సందర్భంగా సామాన్య ప్రజలను వేధించే వారిపై చర్యలు తీసుకుంటామని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అన్నారు. పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాల్లో చాలా వరకు పెట్రోల్ పంపులు సాయంత్రం 5 గంటల వరకు మూసివేయబడతాయి. అయితే అత్యవసర సేవలతో అనుసంధానించబడిన రైళ్లకు చమురు లభిస్తుంది.



వ్యవసాయ మంత్రిత్వ శాఖలో రోజంతా మీటింగ్‌లే:
బంద్ ప్రభావం బయట ఎలా ఉన్నా కూడా కేంద్రంలో మాత్రం కదలికలు తెచ్చినట్లే కనిపిస్తుంది. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధర(MSP) కు హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై డిసెంబర్ 9న ప్రభుత్వం, రైతు సంస్థల మధ్య ఆరో రౌండ్ చర్చలు జరగనున్నాయి. రైతులు అభ్యంతరాల జాబితాను ప్రభుత్వం కోరుతుంది.



ఆంధ్రప్రదేశ్ పరోక్ష మద్దతు.. :
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరోక్షంగా మద్దతు ప్రకటించింది. రైతులు తలపెట్టిన బంద్ కు ఏపీ ప్రభుత్వం పరోక్ష మద్దత్తు ఇస్తుందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు. విద్యా సంస్థలు పూర్తిగా మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఏపీఎస్ ఆర్టీసీ, ప్రభుత్వ కార్యాలయాలు మధ్యాహ్నం ఒంటి గంట తరువాత తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. తెలుగుదేశం పార్టీ బంద్ విషయంలో తటస్థంగా ఉంది. రైతులకు బాసటగా ఉంటామని చెప్పిన టీడీపీ, కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులపై కలెక్టర్లకు వినతిపత్రాలు అందించాలని నిర్ణయించింది.



కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు బీజేపీ, బీజేడీ, వైసీపీ, టీడీపీ, అన్నాడీఎంకే పార్టీలు రాజ్యసభలో మద్దతు పలికాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, తృణమూల్, డీఎంకే, శివసేన, ఆర్జేడీ, అకాలీదళ్, ఎస్పీ, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీలు వ్యతిరేకించాయి. పార్లమెంట్‌లో బిల్లులకు మద్దతు పలికిన పార్టీలు ప్రజాక్షేత్రంలో కూడా రైతులకు మద్దతుగా నిలవాలని నిర్ణయించాయి.