Rakesh Tikait :దేశమంతా పర్యటిస్తా.. కేంద్రానికి అల్టిమేటం, బీజేపీని ఓడించండి

Rakesh Tikait :దేశమంతా పర్యటిస్తా.. కేంద్రానికి అల్టిమేటం, బీజేపీని ఓడించండి

Bjp

Farmers’ protest : దేశమంతా పర్యటించి.. రైతుల ఉద్యమాన్ని ఉధృతం చేస్తానన్నారు భారతీయ కిసాన్‌ యూనియన్‌ ప్రతినిధి రాకేశ్‌ టికాయత్‌. పశ్చిమ బెంగాల్‌లో పర్యటించిన ఆయన.. ఈ నెలలో మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తోన్న ఆందోళనలు డిసెంబర్‌ వరకు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

నూతన వ్యవసాయ చట్టాలు చిన్న వ్యాపారాలు, పరిశ్రమల మూసివేతకు దారితీస్తాయని, కేవలం వాల్‌మార్ట్‌ లాంటి పెద్ద పెద్ద మాల్స్‌కు ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. వివిధ పంటలకు కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చే చట్టాలను తాము కోరుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఒక రాజకీయ పార్టీకి చెందినది అయితే రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేదని… కానీ ఇది బడా వ్యాపారులు నడిపిస్తున్న ప్రభుత్వమని ఫైర్‌ అయ్యారు. దేశం మొత్తాన్ని విక్రయించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాకేశ్‌ టికాయత్‌ వ్యాఖ్యానించారు.

అలాగే బీజేపీని ఓడించాలని పశ్చిమబెంగాల్‌ రైతులకు పిలుపునిచ్చారు టికాయత్‌. బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే పేదల భూములు కార్పొరేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతాయని ఆయన ఆరోపించారు. కేంద్రం రైతుల వెన్ను విరుస్తోందని, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని అణచివేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.