హీటెక్కిన ఢిల్లీ, రైతుల నిరసనలు 72వ రోజు..భారీగా భద్రతా దళాల మోహరింపు

farmers’ protest 72nd day : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలు 72వ రోజుకు చేరాయి. ఈ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని కేంద్రం పదే పదే చెబుతున్నా.. వాటిని వెనక్కి తీసుకుంటే తప్ప ఆందోళన విరమించబోమని రైతు సంఘాలు భీష్మించుకున్నాయి. సింఘు, టిక్రి, ఘజిపూర్ వద్ద రోడ్లపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఢిల్లీ సరిహద్దులకు రైతులు భారీగా చేరుకుంటున్నారు. రోజు రోజుకు రైతు ఉద్యమంలో పాల్గొంటున్న వారి సంఖ్య పెరుగుతోంది.
ఢిల్లీ శివారుల్లో వేలాది మంది రైతులు నిరసనలు కొనసాగిస్తుండటం.. నిరసనలు విస్తరించకుండా ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపేయడం లాంటి పరిణామాలతో ప్రస్తుతం ఢిల్లీలో వాతావరణం వేడెక్కింది. అవసరమైతే ఈ ఏడాదంతా ఆందోళనలు కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించాయి. వ్యవసాయ చట్టాల రద్దు, పంటలకు మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా కేంద్రం అప్రమత్తమైంది. ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా భద్రతా దళాల మోహరింప చేసింది. ఇక రాష్ట్ర రహదారుల దిగ్భందానికి కిసాన్ సంయుక్త మోర్చా పిలుపినివ్వడంతో పోలీసులు అలెర్ట్‌గా ఉన్నారు.
రైతులు ఉద్యమం ఉధృతం అవుతోన్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. రైతులు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం కనీస మద్దతు ధరపై ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు బడ్జెట్ కేటాయింపులతో తమకేమీ సంబంధం లేదని ప్రకటించిన రైతు సంఘాలు.. శనివారం చక్కా జామ్‌కు పిలుపునిచ్చాయి. ఢిల్లీ మినహా దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, రాష్ర్ట రహదారులను దిగ్బంధించేందుకు సిద్ధమవుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడింటి వరకు ఈ కార్యక్రమం జరగనుంది. అయితే జనవరి 26న జరిగిన సంఘటనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. రైతులను అడ్డుకునేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక చక్కా జామ్‌పై గురువారం కేంద్రమంత్రులతో ప్రధాని మోదీ సమీక్షించారు.