రైతుల ఆందోళనతో రోజుకి రూ.3500కోట్ల నష్టం…అగ్రి చట్టాలకు భారతీయ కిసాన్ యూనియన్ మద్దతు

నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తూ 20 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే,అన్నదాతల ఆందోళనల కారణంగా రోజుకు దాదాపు రూ. 3,500 కోట్ల నష్టం వాటిల్లుతోందని అసోచామ్ తెలిపింది.

రైతుల ఆందోళనతో రోజుకి రూ.3500కోట్ల నష్టం…అగ్రి చట్టాలకు భారతీయ కిసాన్ యూనియన్ మద్దతు

Farmers’ protest నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తూ 20 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే,అన్నదాతల ఆందోళనల కారణంగా రోజుకు దాదాపు రూ. 3,500 కోట్ల నష్టం వాటిల్లుతోందని అసోచామ్ తెలిపింది. కరోనా బారి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో రైతులు ఆందోళన చేపట్టడం ప్రతికూల పరిణామమని,ఇప్పటికైనా రైతులు, కేంద్ర ప్రభుత్వం చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని అసోచామ్‌ ఓ ప్రకటనలో కోరింది.

దేశ సరిహద్దుల్లో అన్నదాతులు చేస్తోన్న ఆందోళనలు.. పంజాబ్‌, హర్యాణా,జమ్ముకశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ మొత్తం దాదాపు రూ. 18లక్షల కోట్ల రూపాయలుగా ఉంటుంది. ప్రధానంగా వ్యవసాయం, ఉద్యానవనం, ఫుడ్‌ప్రాసెసింగ్‌, జౌళి, ఆటోమొబైల్‌పైనే వీటి ఆదాయం ఆధారపడి ఉంది. అయితే రైతుల ఆందోళన, రహదారుల నిర్బంధంతో ఈ రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆటో విభాగాలు, సైకిళ్లు, క్రీడా ఉత్పత్తులు, టెక్స్‌టైల్‌ ముడిసరుకుల పరిశ్రమలు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయలేకపోతున్నాయి. ఫలితంగా రోజుకు రూ. 3000-3,500 కోట్ల నష్టం వాటిల్లుతోందని అసోచామ్‌ తన ప్రకటనలో పేర్కొంది.

కాగా, కరోనా పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దేశ ఆర్థిక వ్యవస్థపై రైతుల ఆందోళన తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముందని కాన్ఫడరేషన్ ఆప్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ(CII) కూడా ఆవేదన వ్యక్తం చేసింది. రైతుల ఆందోళన ఇలాగే కొనసాగితే ఆయా రాష్ట్రాల ఆదాయం భారీగా దెబ్బతింటుందని, దేశ ఆర్థికవ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని సీఐఐ హెచ్చరించింది. త్వరితగతిన సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని కోరింది.

మరోవైపు,అన్నదాతలు పోరును ఉద్ధృతం చేశారు. తమను సంక్షోభంలోకి నెట్టే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. ఏదేమైనా తాము తప్పనిసరిగా గెలవాలని నిశ్చయించుకునే దశకు ఈ పోరాటం చేరిందని రైతు నేతలు వ్యాఖ్యానించారు. ఆందోళనల్లో ఇప్పటి వరకు 20 మంది రైతులు అమరులయ్యారన్న అన్నదాతలు వారికి డిసెంబర్‌ 20న అన్ని గ్రామాల్లోనూ ప్రజలు నివాళులర్పించాలని కోరారు. బుధవారం ఢిల్లీ-నోయిడా మధ్య ఉన్న చిల్లా బోర్డర్‌ను పూర్తిగా మూసివేయనున్నట్లు ప్రకటించారు.

అయితే, భారతీయ కిసాన్​ యూనియన్​(కిసాన్​) సభ్యులు నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలిపారు. ఈ విషయాన్ని.. ఇవాళ వారితో జరిగిన భేటీ అనంతరం కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ వెల్లడించారు. కొందరు రైతులు వీరిలో అనుమానాలు రేకెత్తించారని, తాను వాటిని తొలిగించానని తోమర్ తెలిపారు. అందుకే వారు చట్టాలకు మద్దతిస్తున్నట్టు వివరించారు.