మోడీ భయపడ్డాడన్న రైతు సంఘాలు..ఎన్డీయేని గద్దె దింపేస్తామని వార్నింగ్

మోడీ భయపడ్డాడన్న రైతు సంఘాలు..ఎన్డీయేని గద్దె దింపేస్తామని వార్నింగ్

Farmers’ protest నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో కొనసాగడం కష్టమేనని భారతీయ కిసాన్​ యూనియన్(​బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ కీలక వ్యాఖ్యలు చేశారు​. బుధవారం హర్యాణాలోని జింద్​ జిల్లాలో రైతుల ఆందోళనకు మద్దతుగా తలపెట్టిన కిసాన్​ ‘మహాపంచాయత్​’లో రాకేష్ టికాయత్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రాకేష్ టికాయత్.. ఆందోళనలు ఇలాగే కొనసాగితే అధికారం కోల్పోవడం ఖాయమని పరోక్షంగా మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటిదాకా సాగు చట్టాల రద్దు అంశంపై పలుమార్లు చర్చించాం.. అయినా సమస్య పరిష్కారం కాలేదు..అయితే జాగ్రత్తగా వినండి… మిమ్మల్ని గద్దె దించాలని యువత పిలుపునిస్తే ఏమి చేస్తారు?అని కేంద్రాన్ని ప్రశ్నించారు టికాయత్​. కాబట్టి మూడు చట్టాలను వెంటనే రద్దు చేయాలని..కనీస మద్దతు ధర(MSP)వ్యవస్థ కొనసాగేలా కొత్త చట్టం చేయాలని టికాయత్ సృష్టం చేశారు.

ఇక,ఢిల్లీ సరిహద్దుల్లో రహదారులపై ఇనుప ఊచలు, కాంక్రీట్​తో నిర్మాణాలు చేపట్టడంపై టికాయిత్​ విమర్శలు గుప్పించారు. “రాజు భయపడినప్పుడే కోటను భద్రపరుచుకుంటాడు”అని చురకలంటించారు. హర్యానా బీకేయూ చీఫ్ గుర్నామ్ సింగ్ చాదుని మరియు పంజాబ్ బీకేయూ లీడర్ బల్బీర్ సింగ్ రాజేవాల్ మహాపంచాయత్ సమావేశంలో పాల్గొన్నారు. మహాపంచాయత్​’లో ఐదు తీర్మానాలు ఆమోదించారు. సాగు చట్టాలను రద్దు చేయాలి…పంటపై కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాలి…స్వామినాథన్​ కమిషన్ నివేదిక అమలు చేయాలి…వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలి..ఢిల్లీ హింస తర్వాత అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాలని తీర్మాణం చేశారు.

అంతకుముందు… కిసాన్​ మహాపంచాయత్​లో అపశ్రుతి చోటుచేసుకుంది. రాకేశ్​ టికాయిత్​ సహా ఇతర నేతలు వేదికపై ఉండగా ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఎక్కువమంది వేదికపై ఉండటం వల్లే ఈ ఘటన జరిగినట్లు సమాచారం.