ఉద్యమంలో చీలిక..టెంట్లు పీకేస్తున్న రైతులు

ఉద్యమంలో చీలిక..టెంట్లు పీకేస్తున్న రైతులు

farmers taking off their tents ఢిల్లీ హింస అనంతరం దాదాపు 70 రోజులుగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిర్విరామంగా నిరసన చేస్తున్న రైతు సంఘాల్లో చీలిక ఏర్పడినట్టు కనిపిస్తోంది. రైతు సంఘాలు ఒక్కొక్కటిగా ఉద్యమం నుంచి తప్పుకుంటున్నాయి. ఇప్పటికే రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్, భారతీయ కిసాన్​ యూనియన్​(భాను) ఆందోళన నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాయి.

ఈ నేపథ్యంలో చిల్లా సరిహద్దులో కొందరు రైతులు తమ టెంట్లను ఎత్తేస్తున్నారు. నిరసనల నుంచి తప్పుకుంటున్నట్టు రెండు సంఘాలు ప్రకటించిన కొద్దిసేపటికే రైతులు టెంట్లు పీకేశారు. చిల్లా సరిహద్దులో ఇన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నామని.. కానీ ఢిల్లీలో జరిగిన హింస తమను తీవ్రంగా కలచివేసిందని భారతీయ కిసాన్​ యూనియన్ ప్రెసిడెంట్ ఠాకూర్ భాను ప్రతాప్ సింగ్ తెలిపారు​. అందువల్ల 58రోజుల నిరసనకు ముగింపు పలుకుతున్నట్టు ప్రకటించారు. వారి ఉద్దేశం వేరుగా ఉన్న మరొకరి డైరెక్షన్‌లో తాము ముందుకు వెళ్లలేమని రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్ నేషనల్ కన్వీనర్ వీఎం సింగ్ వ్యాఖ్యానించారు.

మరోవైపు,ఢిల్లీ హింసకు సంబంధించి ఇప్పటికే అనేక ఎఫ్​ఐఆర్​లు నమోదు చేశారు పోలీసులు. వీటిల్లోని ఒక ఎఫ్​ఐఆర్​లో.. మేధా పాఠక్​, బుటా సింగ్​, యోగేంద్ర యాదవ్​తో పాటు మొత్తం మీద 37మంది రైతు నేతల పేర్లు ఉన్నాయి. నిర్ణీత సమయం, నిర్దేశిత మార్గలు వంటి నిబంధనలను వీరు ఉల్లంఘించారని ఎఫ్​ఐఆర్​లో పోలీసులు పేర్కొన్నారు.