డిసెంబర్ 19 లోపు డిమాండ్లు అంగీకరించాలి.. కేంద్రానికి రైతు సంఘాలు అల్టిమేటం

  • Published By: bheemraj ,Published On : December 12, 2020 / 09:03 PM IST
డిసెంబర్ 19 లోపు డిమాండ్లు అంగీకరించాలి.. కేంద్రానికి రైతు సంఘాలు అల్టిమేటం

Farmers’ unions issue ultimatum to Center government : కేంద్రానికి రైతు సంఘాలు అల్టిమేటం జారీ చేశాయి. డిసెంబర్ 19 లోపు డిమాండ్లను అంగీకరించకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. గురు తేజ్ బహదూర్ వర్థంతి రోజు నుంచే నిరాహార దీక్షలు ప్రారంభిస్తామన్నారు. పంజాబ్‌ రైతులకు మద్దతుగా రేపు ఉదయం రాజస్థాన్‌లోని షాజహాన్‌పూర్ నుంచి ట్రాక్టర్ మార్చ్ నిర్వహించనున్నట్లు రైతులు ప్రకటించారు. అలాగే రేపు జైపూర్-ఢిల్లీ జాతీయ రహదారిని దిగ్భందిస్తామని రాజస్థాన్ రైతులు ప్రకటించారు.

ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన మరింత ఉధృతమైంది. నిరసన కార్యక్రమాల్లో భాగంగా 17 వ రోజున ఢిల్లీ, యూపీ, హర్యానా సరిహద్దుల్లోని జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్దకు రైతులు భారీగా తరలివచ్చారు. టోల్ ప్లాజాల వద్ద తిష్ట వేశారు. పలు టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి ఫీజు వసూలు చేయకుండా వాహనాల రాకపోకలకు అనుమతించారు.

కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొన్ని టోల్ ప్లాజాలు మూసివేసేందుకు రైతులు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కొందరు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నూతన చట్టాల సవరణకు ఒప్పుకునేది లేదని, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు సంఘాలు తేల్చి చెప్పాయి. ఆలు, చెరకు, కూరగాయలు, పాలు సహా వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరపై చట్టం తేవాలని రైతు నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

నిరాహార దీక్ష చేస్తామని ఇప్పటికే రైతు సంఘాల నేతలు ప్రకటించారు. అదే సమయంలో కేంద్రంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన తర్వాతే తమ ఆందోళన విరమిస్తామని ప్రకటించారు.