రైతులతో రేపు కేంద్రం చర్చలు…”షా” తో కేంద్రమంత్రుల కీలక సమావేశం

రైతులతో రేపు కేంద్రం చర్చలు…”షా” తో కేంద్రమంత్రుల కీలక సమావేశం

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సమస్యలను పరిష్కరించేందుకు బుధవారం(డిసెంబర్-30,2020)మధ్యాహ్నాం ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో ఆరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రంతో భేటీ కావడానికి అంగీకరించారు రైతు సంఘాల నాయకులు. ఈ మేరకు అంగీకారం తెలుపుతూ కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శికి సంయుక్త కిసాన్ మోర్చా లేఖ రాసింది.

నాలుగు అంశాలే అజెండాగా చర్చలకు హాజరవుతున్నట్లు రైతు నేతలు తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖకు రాసిన లేఖలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. కాగా, ఇప్పటివరకు ఐదు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ అవి ఫలించలేదు. చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు పట్టుబట్టగా.. సవరణలు తెస్తామని కేంద్రం చెబుతోంది.

రైతుల ప్రతిపాదనలు

కొత్త సాగు చట్టాలను రద్దు చేసేందుకు విధివిధానాల రూపకల్పన

పంటకు కనీస మద్దతు ధర హామీకు చట్టబద్దత కల్పించడం

దిల్లీ గాలి నాణ్యత ఆర్డినెన్స్ లో రైతులకు మినహాయింపు

విద్యుత్ బిల్లు 2020ని వెనక్కి తీసుకోవడం

 

మరోవైపు, రైతు సంఘాల నాయకులతో కేంద్ర ప్రభుత్వం రేపు చర్చలు జరపనున్న నేపథ్యంలో మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక సమావేశం నిర్వహించారు. వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌తో ఆయన భేటీ అయ్యారు. వ్యవసాయ చట్టాలపై కేంద్రం ప్రతిపాదనలు, రైతుల డిమాండ్లపై స్పందించే అంశాలపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. రైతు సంఘాల నాయకులతో కేంద్ర ప్రభుత్వం రేపు చర్చలు జరపనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.