కేంద్రానికి రైతుల హెచ్చరిక : ఈసారి చర్చలు విఫలమైతే ఢిల్లీ మొత్తం దిగ్బంధమే

కేంద్రానికి రైతుల హెచ్చరిక : ఈసారి చర్చలు విఫలమైతే ఢిల్లీ మొత్తం దిగ్బంధమే

FARMERS PROTESTS నూతన వసాయ చట్టాలపై జనవరి 4న చర్చల సందర్భంగా.. తమకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని కేంద్రానికి హెచ్చరించారు రైతులు. రైతు సంఘాలు-ప్రభుత్వం మధ్య జనవరి 4న జరగనున్న సమావేశంలో పురోగతి లేకుంటే..జనవరి 6న ట్రాక్టర్ మార్చ్ నిర్వహిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు యుధ్వీర్ సింగ్ అన్నారు. హర్యాణా- రాజస్తాన్​ సరిహద్దుల్లోని రైతులు భారీ సంఖ్యలో ఢిల్లీని ముట్టడిస్తారని హెచ్చరించారు. హర్యాణాలో షాపింగ్​ మాళ్లు,పెట్రోల్​ బంకులు బంద్​ చేస్తామని ఇవాళ మీడియా సమావేశంలో తెలిపారు.

యుధ్వీర్ సింగ్ మాట్లాడుతూ… ప్రభుత్వం రైతులను తేలికగా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది, షాహీన్ బాగ్ ఆందోళనకారులను ప్రభుత్వం చెదరగొట్టగలిగింది..అలాగే రైతులను కూడా చేయగలమని వాళ్లు అనుకుంటున్నారు. కానీ అలాంటి రోజు రాదు. జనవరి-4న ఏడో దఫా చర్చల సందర్భంగా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకుంటే రైతులే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఆరో దఫా చర్చల సందర్భంగా 50శాతం సమస్యలు పరిష్కారమైనట్లు ప్రభుత్వం చేస్తోన్న ప్రచారం అవాస్తవమని తెలిపారు. తమ రెండు ప్రధాన డిమాండ్లు..మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయడం, MSP(కనీస మద్దతు ధర)కి చట్టబద్ద హామీ అని..ఇవి రెండు ఇంకా పెండింగ్ లోనే ఉన్నట్లు యుధ్వీర్ సింగ్ తెలిపారు.

స్వరాజ్ ఇండియా నాయకుడు యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ…జనవరి-4న జరిగే చర్చల్లో మా డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించకుంటే జనవరి-6న కుండ్లీ-మానేసర్-పల్వాల్(KMP)వద్ద మార్చ్ నిర్వహిస్తాం అని అన్నారు.షహజాన్ పూర్ బోర్డర్ నుంచి ఎప్పుడు ముందుకు కదిలేది ప్రకటిస్తామన్నారు.

హర్యానా రైతు నాయకుడు వికాస్ సిర్సార్ మాట్లాడుతూ…టోల్ ప్లాజాలన్నీ ఫ్రీగానే ఉంటాయ్. అన్ని పెట్రోల్ బంకులు,మాల్స్(ప్రేవేట్ తప్ప)మూసివేయబడతాయి. హర్యాణాలో బీజేపీ-జేజేపీ ప్రభుత్వం ఆందోళనలను ఎదుర్కొక తప్పదు. బీజేపీ..జేజేపీ కూటమి విడిపోయేవరకు ఈ ఆందోళన కొనసాగుతుందని తెలిపారు.

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ అన్నదాతలు హస్తిన సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే, రైతులతో ప్రభుత్వం ఇప్పటివరకు ఆరు విడతలుగా చర్చలు జరిపింది. ఓసారి కేంద్ర హోం మంత్రి అమిత్​ షా సైతం కూడా చర్చలు జరిపారు. అయితే.. అన్నీ అసంపూర్తిగానే ముగిశాయి.