యూపీలో క్రిమినల్ ఖతం : 23 మంది పిల్లలు సేఫ్

  • Published By: madhu ,Published On : January 31, 2020 / 12:37 AM IST
యూపీలో క్రిమినల్ ఖతం : 23 మంది పిల్లలు సేఫ్

యూపీలోని ఫరూకాబాద్‌లో 23 మంది చిన్నారుల్ని బందీలుగా తీసుకున్న నేరస్తుడు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. దాదాపు 10 గంటల హైడ్రామా తర్వాత నేరగాడ్ని పోలీసులు కాల్చి చంపారు. అతడి చెరలో ఉన్న చిన్నారులతో పాటు వారి తల్లుల్ని రక్షించారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో పెను కలకలం సృష్టించింది.

ఫరూకాబాద్‌కు చెందిన సుభాష్‌ బాథమ్‌ అనే వ్యక్తికి ఓ హత్యకేసులో జీవితఖైదు పడింది. ప్రస్తుతం పెరోల్‌ మీద బయటకొచ్చాడు. 2020, జనవరి 30వ తేదీ గురువారం మధ్యామ్నం కసారియా గ్రామంలోని తన ఇంటికి సమీపంలో ఉన్న ఇతర ఇళ్లకు వెళ్లి తన కుమార్తె పుట్టినరోజు ఉందనీ… వెంటనే పిల్లల్ని పంపించాలని అందరినీ కోరాడు. తాను మారిపోయిన వ్యక్తినని అందర్నీ నమ్మించాడు.

వారంతా నిజమేననుకొని తమ పిల్లల్ని బర్త్‌డే ఫంక్షన్‌ నిమిత్తం సుభాష్‌తో అతని ఇంటికి పంపారు. ఒకరిద్దరు తల్లులైతే తోడు కూడా వెళ్లారు. కాసేపయ్యాక మరికొందరు పిల్లలు వచ్చారు. అంతా వచ్చాక ఇంటి కిందనున్న సెల్లార్‌లోని గదిలో కూర్చోబెట్టాడు. లోపల్నుంచి గడియలు వేసేసి, తాళాలు కూడా వేసి వారందరినీ బందీలుగా చేశాడు. ఆఖరికి తన భార్య, పిల్లలను కూడా చెరలో పెట్టాడు.

ఎంతసేపటికీ తమ పిల్లలు తిరిగి రాకపోయేసరికి వీధిలోని కొందరి తండ్రులు అక్కడికొచ్చి ఆరా తీశారు. సుభాష్‌ లోపలి నుంచే వారిని బయటకు తరిమేశాడు. పిల్లల గురించి మాట్లాడితే కాల్చిపారేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత సుభాష్‌ ఇంటి దగ్గరికి వెళ్లి నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన మరో గ్రామస్తుడిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. తాను ఎవరితోనూ మాట్లాడనని… ఎమ్మెల్యేను పిలిపించాలని చెప్పాడు. వెంటనే భోజ్‌పూర్‌ ఎమ్మెల్యే నాగేంద్రసింగ్‌కు కబురుపెట్టారు.

సాయంత్రానికి నాగేంద్రసింగ్‌ అక్కడకు చేరుకున్నారు. ఆయన్ను కలవడానికి కూడా సుభాష్‌ ఒప్పుకోలేదు. అర్ధరాత్రి దాకా ఈ బందీ డ్రామా కొనసాగింది. నిందితుడు ఏడాది వయసున్న ఒక్క నెల పాపను మాత్రం బయటకు వదిలి పెట్టాడు. సుభాష్‌ చెరలో 23 మంది పిల్లలున్నట్లు తెలియడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లో కలకలం రేగింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌‌కు విషయం తెలిసింది. వెంటనే ఆయన పోలీసు ఉన్నతాధికారులతో స్వయంగా మాట్లాడారు.

వెంటనే యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ కమెండోలను అక్కడికి పంపించారు. వారిపై కాల్పులు జరిపిన సుభాష్‌… ఓ గ్రెనేడ్‌ కూడా విసిరేశాడు. పిల్లల్ని ఏమీ చేయకుండా లొంగిపోవాలంటూ కమెండోలు విజ్ఞప్తి చేసినా… సుభాష్‌ వెనక్కి తగ్గలేదు. దీంతో బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించిన కమెండోలు అతడ్ని కాల్చి చంపారు. 10 గంటల తర్వాత 23 మంది చిన్నారుల్ని, వారి తల్లుల్ని విడిపించారు.
 

సుభాష్ ఎవరు ? 
సుభాష్‌ ఓ మహిళ హత్యకేసులో దోషి. ఆ హత్యతో తనకు సంబంధం లేదని… ఆ సమయంలో తాను ఆ చోటే లేనని వాదించాడు. కానీ గ్రామస్తులు కొందరు అతనూ ఉన్నాడని చెప్పడంతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. దాంతో ఊరిమీదే కోపం పెంచుకున్నాడు సుభాష్‌. సుభాష్‌ మానసిక స్థితి సరిగా లేదని… ఎపుడేం చేస్తాడో తెలియడం లేదని పోలీసులు చెప్పారు.

Read More : టెన్షన్.. టెన్షన్: బంధీలుగా 20మంది చిన్నారులు