అప్రమత్తంగా ఉండాల్సిందే…దేశంలో కరోనా కొత్త రకం కేసులపై కేంద్రం క్లారిటీ

అప్రమత్తంగా ఉండాల్సిందే…దేశంలో కరోనా కొత్త రకం కేసులపై కేంద్రం క్లారిటీ

Covid Strain Found In UK Not Seen In India సెప్టెంబర్ లో బ్రిటన్ లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా వైరస్ పై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ కొత్తరకం కరోనా వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తోందని…ఇప్పటి వైరస్ కన్నా 70 శాతం ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రాధమిక నివేదకలు సూచిస్తున్నాయి. అయితే, భారత్ లోకి కూడా ఈ కొత్త రకం కరోనా వైరస్ ఎంట్రీ అయిందా లేదా అనే రకరకాల ప్రశ్నలు ప్రజల్లో నెలకొన్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది.

బ్రిటన్ లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్..ఇప్పటివరకైతే భారత్ లోకి ప్రవేశించలేదని మంగళవారం(డిసెంబర్-22,2020)కేంద్రం సృష్టం చేసింది. కొత్త వైరస్ స్ట్రెయిన్ వ్యాక్సిన్లపై ఎలాంటి ప్రభావం చూపదని  తెలిపింది. కొత్త రకం వైరస్ గురించి ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని, అయితే మనం అప్రమత్తంగా ఉండటం అవసరమని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. బ్రిటన్ లో కొత్త COVID-19 యొక్క కొత్త జాతి ప్రసార సామర్థ్యాన్ని పెంచిందని అన్నారు. ఈ మ్యుటేషన్(పరివర్తనము లేదా మార్పు) వ్యాధి తీవ్రతను ప్రభావితం చేయదు. ఈ మ్యుటేషన్ ద్వారా కేసు మరణాలు ప్రభావితం కావని ఆయన తెలిపారు.

బ్రిటన్ నుంచి భారత్ కు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా RT-PCR టెస్ట్ చేయించుకోవాలని,ఒకవేళ పాజిటివ్ వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫెసిలిటీలో ఐసొలేట్ అవ్వాలని ఇవాళ(డిసెంబర్-22,2020) కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన కొత్త గైడ్ లైన్స్ లో పేర్కొంది. నవంబర్-25 నుంచి డిసెంబర్-23 లోపల యూకే నుంచి భారత్ కు వచ్చినవారందరూ తప్పనిసరిగా టెస్ట్ చేయించుకోవాలని తెలిపింది. టెస్ట్ లో పాజిటివ్ వచ్చినవారికి ప్రతేక ఐసొలేషన్, పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో కలిసి ప్రయాణించిన సహచర ప్యాసింజర్లకు ఇనిస్టిస్ట్యూషనల్ క్వారంటైన్ వంటివి కేంద్ర ఆరోగ్యశాఖ.. విడుదల చేసిన కొత్త గైడ్స్ లో తెలిపింది.

కాగా,బ్రిటన్‌ లో కొత్త కరోనా వైరస్ జోరు బాగా ఎక్కువగా ఉండటంతో… భారత ప్రభుత్వం రెండు దేశాల మధ్యా విమాన సర్వీసులన్నింటినీ బుధవారం నుంచి ఈ నెల 31 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం రాత్రి వరకు మాత్రం సర్వీసులు కొనసాగుతాయని తెలిపింది.

మరోవైపు,యూకే నుంచి భారత్ కు వచ్చిన ప్రయాణికులు, సిబ్బందిలో ఎనిమిది మందికి వైరస్ సోకినట్లు తేలిందని ఓ అధికారి మంగళవారం తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారంతా గత రాత్రి యూకే నుంచి దేశానికి చేరిన వారే. సోమవారం రాత్రి 11.30 గంటలకు లండన్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన విమానంలో ఉన్న 266 మంది ప్రయాణికులు, సిబ్బందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. ఇందులో ఐదుగురు పాజిటివ్‌గా పరీక్షించారు. అదేవిధంగా, కనెక్టింగ్ విమానం ద్వారా చెన్నై వెళ్లిన మరో వ్యక్తికి అక్కడ నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని చెప్పారు. కోల్ ​కతాలో మరో ఇద్దరికి కరోనా నిర్ధరణ అయింది. వీరు బ్రిటన్ నుంచే వచ్చారని అధికారులు తెలిపారు. అయితే, వీరందరికి సోకింది కరోనా కొత్త జాతేనా? కాదా అని తెలుసుకునేందుకు వారి నమూనాలను ఎన్‌సీడీసీకి పంపారు. అనంతరం వైరస్‌ సోకిన వారందరికీ సంరక్షణ కేంద్రాలకు తరలించారు.