టోల్ గేట్ల వద్ద ఇక తిప్పలే : ఒక్క లైన్‌‌లోనే చెల్లింపులు

  • Published By: madhu ,Published On : January 15, 2020 / 03:40 AM IST
టోల్ గేట్ల వద్ద ఇక తిప్పలే : ఒక్క లైన్‌‌లోనే చెల్లింపులు

జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనదారులకు ఇక తిప్పలు తప్పవు. ఎందుకంటే నగదు చెల్లించే వాహనాలకు ఒక్క లైన్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. 2020, జనవరి 15వ తేదీ బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. హైబ్రిడ్ విధానంలో 25 శాతం లేన్లు నగదు చెల్లించే వామనాలకు కేటాయించగా, ఫాస్టాగ్ వాహనాలకు మిగతావి అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం హై బ్రిడ్ విధానం గడువు 2020, జనవరి 14వ తేదీ మంగళవారంతో ముగిసిపోయింది. బుధవారం నుంచి కేంద్రం ముందుచెప్పినట్లుగా టోల్ గేట్ వద్ద ఒక్కో వైపు మాత్రమే నగదు చెల్లింపు వాహనాల కోసం కేటాయించనున్నారు. 

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు భారీ సంఖ్యలో తమ తమ స్వగ్రామాలకు తరలివెళ్లారు. పండుగ తర్వాత వీరందరూ తిరుగు ప్రయాణం కానున్నారు. వెళ్లిన సమయంలో హై బ్రిడ్ విధానం వల్ల టోల్ గేట్ల ఎలాంటి ఇబ్బందులు కలుగ లేదు. కానీ ఇప్పుడు ఒక్క లేన్ మాత్రమే నగదు చెల్లింపునకు కేటాయిస్తుండడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. 55 శాతం వాహనాలకు ఫాస్టాగ్ ఉందని, 45 శాతం వాహనాలకు టోల్‌ను నగదు రూపంలో చెల్లించారు. ఇప్పుడు ఈ 45 శాతం వాహనాల తిరుగు ప్రయాణంలో ఆ ఒక్కోవైపు నుంచే ముందుకు సాగాల్సి ఉంటుంది.

దీంతో కిలో మీటర్‌కి పైగా క్యూలు ఏర్పడే పరిస్థితి ఉందన్నారు. ఇబ్బందులు తీవ్రంగా ఉంటే…అప్పటికప్పుడు కేంద్రం నుంచి అనుమతి పొంది లేన్ల సంఖ్యను పొడిగించే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. హై బ్రిడ్ విధానం గడువు పెంచితే బుధవారం ఉదయం తమకు సమచారం వస్తుందని, అప్పుడు ఇబ్బంది ఉండే అవకాశం ఉండదని చెబుతున్నారు. 

Read More : JEE Main ఇక తెలుగులో