భారత్‌కు పొంచివున్న మరో వైరస్‌ ముప్పు

భారత్‌కు పొంచివున్న మరో వైరస్‌ ముప్పు

Fear of bird flu in India : భారత్‌కు మరో వైరస్‌ ముప్పు పొంచివుందా? 2021లోనూ వైరస్‌లతో పోరాటం చేయక తప్పదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. క‌రోనా మ‌హ‌మ్మారి పీడ విర‌గ‌డ కానే లేదు.. అప్పుడే మ‌రో వైర‌స్ ఇండియాను వ‌ణికిస్తోంది. భారత్‌కు కొత్తగా బర్డ్ ఫ్లూ భయం పట్టుకుంది. అసలే కరోనా కరోనా కొత్త స్ట్రెయిన్‌తో వణికిపోతున్న భారత్‌లో ఇప్పుడు కొత్తగా బర్డ్ ఫ్లూ ఎంటర్‌ అయింది. దీని కారణంగా లక్షలాది పక్షులు మృత్యువాత పడుతున్నాయి. కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, హర్యానాల్లో దీని తీవ్రత అధికంగా ఉంది.

బ‌ర్డ్‌ ఫ్లూని తొలిసారి రాజ‌స్థాన్‌లో గుర్తించారు. అక్కడ వంద‌ల సంఖ్యలో మృత్యవాత ప‌డుతున్న కాకుల‌ను చూసి ఆందోళ‌న చెందిన అధికారులు.. వాటి క‌ళేబ‌రాల‌ను ప‌రీక్షించ‌గా బ‌ర్డ్‌ఫ్లూ వ‌ల్లే అవి చ‌నిపోయిన‌ట్లు తేలింది. డిసెంబ‌ర్ 25న తొలిసారి దీన్ని గుర్తించారు. కోటె, బార‌న్‌, పాలి, జోధ్‌పూర్‌, జైపూర్ జిల్లాల‌కు బ‌ర్డ్ ఫ్లూ పాకింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో అధికారులు ప్రజలను హెచ్చరించారు. ఆ త‌ర్వాత ఈ ఫ్లూ మ‌రో నాలుగు రాష్ట్రాల‌కు పాకింది. హ‌ర్యానాలో ల‌క్షల సంఖ్యలో కోళ్లు చనిపోవడంపై అక్కడి ప‌శుసంవ‌ర్ధక శాఖ విచార‌ణ‌కు ఆదేశించింది. మ‌ధ్యప్రదేశ్‌లోనూ చ‌నిపోయిన కాకుల క‌ళేబ‌రాల్లో బ‌ర్డ్ ఫ్లూ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇండోర్‌, మంద్‌సౌర్‌, అగ‌ర్‌మాల్వా, ఖార్‌గోన్ జిల్లాలకు ఇప్పటికే ఈ బ‌ర్డ్‌ఫ్లూ పాకింది.

బర్డ్‌ ఫ్లూ ఇప్పుడు కొత్తగా వచ్చిన వైరస్‌ కాదు. ఒక్కప్పుడు భారత్‌లో ప్రళయం సృష్టించింది కూడా. బర్డ్ ఫ్లూను తొలిసారిగా 1997లో చైనాలో గుర్తించారు. అది భారత్‌లోకి 2006లో ప్రవేశించింది. 2006లో మహారాష్ట్ర, 2008లో పశ్చిమబెంగాల్‌, 2014లో కేరళలో బర్డ్ ఫ్లూ భారీ నష్టాన్ని కలిగించేలా చేసింది. కేర‌ళ అయితే బ‌ర్డ్ ఫ్లూను ఏకంగా రాష్ట్ర విప‌త్తుగా ప్రక‌టించింది. అంతేకాదు ఇది మ‌రింత వ్యాపించ‌కుండా 40 వేల కోళ్లను చంప‌డానికి కూడా ఆ రాష్ట్రం ప్లాన్ చేస్తోంది. ఈ రాష్ట్రంలో ఇన్‌ఫ్లుయెంజా H1N8 వైర‌స్‌ను గుర్తించారు. ముఖ్యంగా కొట్టాయం, అల‌ప్పుజ జిల్లాల‌ను హైఅల‌ర్ట్‌లో ఉంచారు.

బ‌ర్డ్‌ఫ్లూ అనేది ఏవియ‌న్ ఇన్‌ఫ్లుయెంజా వైర‌స్‌లతో క‌లిగే ఒక ఇన్ఫెక్షన్‌. ఈ ఫ్లూ వైర‌స్‌లు ప‌క్షుల్లో స‌హ‌జంగానే క‌నిపిస్తుంటాయి. ప‌క్షుల్లో చాలా వేగంగా వ్యాప్తి చెంది, కోళ్లు, బాతుల లాంటి ప‌క్షుల‌ను చంపేస్తుంటుంది. జ‌బ్బుప‌డిన‌, చ‌నిపోయిన ప‌క్షుల‌కు చేరువ‌గా వెళ్లిన మ‌నుషులకు కూడా ఇది పాకుతుంది. అయితే మ‌నుషుల నుంచి మ‌నుషుల‌కు వ‌చ్చే అవ‌కాశాలు మాత్రం చాలా చాలా త‌క్కువ‌. ప‌క్షుల్లో ఈ వైర‌స్ వ్యాప్తిని సాధ్యమైనంత త‌క్కువ చేయ‌డం ద్వారానే మ‌నుషుల‌కు ముప్పు లేకుండా చేయ‌వ‌చ్చు. ప్రస్తుతానికి ఈ వైర‌స్ వేగంగా వ్యాప్తి చెంద‌కుండా పౌల్ట్రీల్లోని కోళ్లను చంప‌డం త‌ప్ప మ‌రో మార్గం లేదు.

బర్డ్ ఫ్లూ వైరస్ కోళ్ల ద్వారా మనుషులకు వచ్చే ఛాన్స్ ఉండడంతో అధికారులు అలర్ట్‌ అయ్యారు. అన్ని రాష్ట్రాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పౌల్ట్రీ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. బర్డ్‌ ఫ్లూ ప్రభావిత రాష్ట్రాల్లో చికెన్ సెంట‌ర్లను మూసివేయాల‌ని అధికారులు ఆదేశించారు. గుడ్లు, చికెన్‌ అమ్మకాలను కూడా నిషేధించారు. కొన్ని ప్రాంతాల్లో కోళ్ల ఎగుమతి, దిగుమతులను నిలిపివేశారు. అయితే ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ ప్రకారం.. పౌల్ట్రీ ఉత్పత్తుల‌ను వండుకొని, తిన‌వ‌చ్చు. ఈ వైర‌స్ 30 నిమిషాల‌పాటు 70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ద‌గ్గర చ‌నిపోతుంది. అయితే పౌల్ట్రీ ఉత్పత్తుల‌ను వాడిన త‌ర్వాత శుభ్రంగా చేతులు క‌డుక్కోవ‌డం మాత్రం త‌ప్పనిస‌రి. గుడ్లలోని తెల్ల, ప‌చ్చసొన‌లు పూర్తిగా ఉడికి గ‌ట్టిప‌డే వ‌ర‌కూ గుడ్లను ఉడికించాలి.

మరోవైపు బర్డ్ ఫ్లూ వ్యాప్తి వేగంగా విస్తరిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. దీనిని నివారించడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కీలక సూచనలు చేసింది. బర్డ్ ఫ్లూ వ్యాప్తిని నివారించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కార్యాచరణను రూపొందించుకోవాలని పేర్కొంది. వలస పక్షులకు బర్డ్ ఫ్లూ సోకకుండా రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ కోరింది. ప్రతివారం నివేదికలను సమర్పించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.