చల్లానకు భయపడి…బైక్ అడిగిన కొడుకును ఇంట్లో బంధించిన తల్లిదండ్రులు

  • Published By: venkaiahnaidu ,Published On : September 11, 2019 / 07:36 AM IST
చల్లానకు భయపడి…బైక్ అడిగిన కొడుకును ఇంట్లో బంధించిన తల్లిదండ్రులు

ట్రాఫిక్ కొత్త రూల్స్ వాహనదారుల్లో వణుకుపుట్టిస్తున్నాయి. బండి తీయాలంటే గుండెల్లో గుభేల్ అంటోంది. ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారోనని హడలి చస్తున్నారు.  ఒక్క డాక్యుమెంట్ లేకున్నా భారీ జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి. సెప్టెంబర్ 1 నుంచి కొత్త మోటర్ వాహనాల చట్టం అమల్లోకి రావడంతో కొన్నిరోజులుగా వందల సంఖ్యలో వాహనదారులకు భారీగా చలాన్లు నమోదయ్యాయి.

అయితే ఈ సమయంలో  చలాన్ల భయంతో….బైక్‌ అడుగుతున్నాడని ఓ కుటుంబం తమ 16ఏళ్ల కుమారుడిని గదిలో నిర్బంధించాడు. మైనర్‌ అయిన తమ కొడుకుకి బైక్‌ కీస్‌ ఇచ్చేందుకు నిరాకరించారు. మైనర్లు వాహనం నడిపితే ట్రాఫిక్‌ పోలీసులు భారీగా జరిమానాలు విధిస్తున్న విషయం విదితమే. మైనర్లు వాహనం నడిపితే.. సంరక్షకుడు లేదా వాహన యజమానికి రూ. 25 వేల జరిమానాతో పాటు 3 నెలల జైలు శిక్ష, వాహన రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ధరమ్‌ సింగ్‌… తన కుమారుడి ఒత్తిడి మేరకు కొన్నాళ్ల క్రితం బైక్‌ ను ఇప్పించాడు. బైక్‌ తీసుకుని కుమారుడు.. రోడ్లపై దోస్తులతో షికారు చేస్తున్నాడు. అయితే తమ కుమారుడు బైక్‌ నడుపుతూ పోలీసులకు పట్టుబడితే.. భారీగా జరిమానా విధిస్తారని భయపడిన తల్లిదండ్రులు కుమారుడిని ఓ గదిలో నిర్బంధించాడు. దీంతో తనను గదిలో నిర్బంధించిన తల్లిదండ్రులపై కొడుకు  పోలీసులకు కంప్లెయింట్ చేశాడు. పోలీసులు ధరమ్‌ సింగ్‌ ఇంటికి చేరుకుని.. తల్లిదండ్రులకు,కొడుకుకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు.