Indore IIM : ఇండోర్ ఐఐఎంలో ఫెలో ప్రోగ్రామ్ నోటిఫికేషన్

ప్రోగ్రామ్ లో చేరే అభ్యర్ధులకు ఫైనాన్షియల్‌ సపోర్ట్‌గా నెలకు రూ.30,000 నుంచి రూ.35,000 వరకు స్టయిపెండ్‌ ఇస్తారు.

10TV Telugu News

Indore IIM : ఇండోర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లో ఫెలో ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 సీట్లు భర్తీ చేయనున్నారు. ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగేళ్ల తొమ్మిది నెలలు. అకడమిక్‌ ప్రతిభ, జాతీయ పరీక్ష స్కోర్‌, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులకు ప్రవేశాలు కల్పిస్తారు.

కమ్యూనికేషన్‌, ఎకనామిక్స్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్‌, ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌(ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, ఆపరేషన్స్‌ రీసెర్చ్‌, స్టాటిస్టిక్స్‌, మేథమెటిక్స్‌), ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌ అండ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌లలో స్పెషలైజేషన్ ప్రోగ్రామ్ లు ఉన్నాయి.

అభ్యర్ధులు ఏదేని స్పెషలైజేషన్‌తో మాస్టర్స్‌ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్‌ డిగ్రీ, రెండేళ్ల పీజీ డిప్లొమా, ఇంజనీరింగ్‌ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ప్రథమ శ్రేణి మార్కులు తప్పనిసరి. కనీసం 50 శాతం మార్కులతో సీఏ, ఐసీడబ్ల్యూఏఐ, సీఎస్‌ ఉత్తీర్ణులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులందరికీ పదోతరగతి నుంచి డిగ్రీ వరకు ప్రథమ శ్రేణి మార్కులు ఉండాలి. క్యాట్‌, జీమ్యాట్‌, గేట్‌, జీఆర్‌ఈ వ్యాలిడ్‌ స్కోర్‌ లేదా జేఆర్‌ఎఫ్‌ అర్హత ఉండాలి. ఐఐఎంల నుంచి ఎంబీఏ పూర్తిచేసిన వారికి ఈ స్కోర్‌ అవసరం లేదు.

ప్రోగ్రామ్ లో చేరే అభ్యర్ధులకు ఫైనాన్షియల్‌ సపోర్ట్‌గా నెలకు రూ.30,000 నుంచి రూ.35,000 వరకు స్టయిపెండ్‌ ఇస్తారు. ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ గ్రాంట్‌ కింద రూ.2లక్షలు, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ గ్రాంట్‌ కింద రూ.1.2 లక్షలు అనగా ఏడాదికి రూ.30,000, కంటింజెన్సీ గ్రాంట్‌ కింద రూ.లక్ష అనగా ఏడాదికి రూ.25,000 ఇస్తారు. ఉచిత భోజన, వసతి సౌకర్యాలు ఉంటాయి.

దరఖాస్తు ఫీజు జనరల్‌ అభ్యర్థులకు రూ.1000; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 2022 జనవరి 31గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.iimidr.ac.in