భారత నౌకాదళంలో తొలిసారి… యుద్ధనౌకల్లో ఇద్దరు మహిళా అధికారుల నియామకం

  • Published By: venkaiahnaidu ,Published On : September 21, 2020 / 07:04 PM IST
భారత నౌకాదళంలో తొలిసారి… యుద్ధనౌకల్లో ఇద్దరు మహిళా అధికారుల నియామకం

భారత నావికాదళంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. నావికాదళంలో తొలిసారిగా ఇద్దరు మహిళా అధికారులు నియమితులయ్యారు. సబ్‌ లెఫ్టినెంట్ హోదాలో ఆ ఇద్దరూ యుద్ధ విమానాల నిర్వహణలో సేవలందించనున్నారు.

లింగసమానత్వాన్ని పునర్నిర్వచిస్తూ యుద్ధనౌకల్లో తొలి మహిళా అధికారులుగా సబ్‌ లెఫ్టినెంట్లు… కుముదిని త్యాగి, రితిసింగ్‌లు కేరళ కొచ్చిలోని యుద్ధ నౌకలో యుద్ధ విమానాల నిర్వాహకులుగా నియమితులయ్యారు. వీరు ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ , ఆన్-బోర్డ్ మారిటైమ్ రికనైసెన్స్ , యాంటీ సబ్‌మెరైన్ యుద్ధ విమానాల్లో సేవలందిస్తారని భారత నావికాదళం ప్రకటించింది.

ఈ ఇద్దరు మహిళా అధికారులు వివిధ అంశాల్లో శిక్షణ పొందారు. అరుదైన ‘వింగ్స్’ అవార్డు గ్రహీతలు.. కుముదిని త్యాగి, రీతీసింగ్‌ లు ఎయిర్ నావిగేషన్, ఫ్లయింగ్ విధానాలు, వాయు యుద్ధంలో ఉపయోగించే వ్యూహాలు, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధం వచ్చినప్పుడు ఎలా స్పందించాలి అనే వివిధ అంశాల్లో ఈ మహిళా అధికారులు శిక్షణ పొందారు.


కాగా, రఫేల్‌ యుద్ధవిమానాలకు ఎంపిక చేసిన పైలట్లలో ఓ మహిళా పైలట్‌ను ఐఏఎఫ్‌ నియమించేందుకు సన్నద్ధమైన నేపథ్యంలో నేవీలో ఇద్దరు మహిళా అధికారుల నియామకం సైన్యంలో మహిళలకు సమ ప్రాతినిథ్యం దిశగా అడుగులు పడుతున్నాయనే సంకేతాలు పంపింది.

ఇప్పటివరకు, నావికాదళంలో మహిళా అధికారుల నియామకానికి బోలెడన్ని పరిమితులుండేవి. ఎక్కువ సమయం పనిచేయాల్సి ఉండటం, సిబ్బంది క్వార్టర్లలో ప్రైవసీ ఇబ్బందులు, మహిళలు, పురుషులకు ప్రత్యేక బాత్ ‌రూంల కొరత వంటి పలు కారణాలతో ఇప్పటివరకూ యుద్ధ నౌకల్లో మహిళా అధికారులను నియోగించలేదు.ఇప్పుడు నావికాదళంలో నారీశక్తి విస్తరణకు .. కుముదిని, రీతీసింగ్‌ ల నియామకం ఓ మైలురాయిగా పేర్కొన్నారు నావల్ స్టాఫ్ చీఫ్, రేర్ అడ్మిరల్ ఆంటోనీ జార్జ్.


నౌకాదళం​ అమ్ములపొదిలో చేరనున్న అత్యాధునిక ఎంహెచ్‌-60ఆర్‌ హెలికాఫ్టర్లలో వీరు విధులు నిర్వహిస్తారని భావిస్తున్నారు. ఎంహెచ్‌-60ఆర్‌ హెలికాఫ్టర్లు శత్రు దేశాల నౌకలు, సబ్‌మెరైన్లను గుర్తిస్తాయి.