మొదటిసారి అహంకార ప్రభుత్వం రాజ్యమేలుతోంది : సోనియా

మొదటిసారి అహంకార ప్రభుత్వం రాజ్యమేలుతోంది : సోనియా

sonia-modi

arrogant govt in power నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తోన్న ఆందోళనలు ఆరో వారానికి చేరుకున్న సమయంలో ఇవాళ(జనవరి-3,2021)కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రైతుల కష్టాలను పట్టించుకోని అహంకార ప్రభుత్వం మొదటిసారి రాజ్యమేలుతోందని​ సోనియాగాంధీ ఆరోపించారు. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి ఇలాంటి ప్రభుత్వం ఉండటం ఇదే తొలిసారి అని ఓ ప్రకటనలో సోనియాగాంధీ వ్యాఖ్యానించారు.

9 రోజులుగా చలి, వర్షంలోనూ ఆందోళన చేస్తున్న రైతులను చూసి హృదయం చలించిపోతోందని సోనియా అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో అందరి ప్రయోజనాలను కాపాడాలని..అదే రాజధర్మం అని సోనియా తెలిపారు. ఉద్యమంలో ప్రాణత్యాగం చేసుకున్న 50 మంది రైతులకు ఏ ఒక్క కేంద్ర మంత్రి సానుభూతి ప్రకటించలేదని సోనియా విమర్శించారు. తమవారిని కోల్పోయిన కుటుంబాలకు ధైర్యాన్ని కల్పించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా కేంద్రప్రభుత్వం సాగు చట్టాలను రద్దు చేయాలని సోనియా డిమాండ్​ చేశారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు చట్టాల రద్దుతోనే శాంతి చేకూరాలన్నారు.

మరోవైపు,సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దుల్లో రైతులు 39 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. చట్టాలతో కార్పొరేట్​ దయాదాక్షిణ్యాల కిందకు తమను నెట్టివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రైతు సంఘాల నేతలతో కేంద్రప్రభుత్వం ఆరు సార్లు చర్చలు జరిపినప్పటికీ.. ఇంకా ప్రతిష్టంభన వీడలేదు. దీంతో సోమవారం(జనవరి-4,2021)మరోసారి రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రం రెడీ అయింది. అయితే,ఈ సారి చర్చలు విఫలమైతే మొత్తం ఢిల్లీని దిగ్భందిస్తామని రైతు సంఘాలు కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించాయి. వ్యవసాయ చట్టాల రద్దుకు ప్రత్యామ్నాయం లేదంటున్నారు రైతు సంఘాల నేతలు. ఇక,ఢిల్లీలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతుండడంతో రైతులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. రైతుల మరణాల సంఖ్య పెరుగుతోంది.