వీడియో: సరోగేట్ మదర్‌గా చిరుతపులి..రెండు పిల్లలకు జన్మనిచ్చింది

  • Published By: veegamteam ,Published On : February 26, 2020 / 09:27 AM IST
వీడియో: సరోగేట్ మదర్‌గా చిరుతపులి..రెండు పిల్లలకు జన్మనిచ్చింది

ప్రపంచంలో 30 సంవత్సరాల తరువాత తొలిసారి ఇన్విట్రో టెక్నిక్ సాయంతో సరోగేట్ మదర్‌గా మారిన చిరుత రెండు కూనలకు జన్మనిచ్చింది. ఈ తల్లి చిరుత పేరు కిబీబీ. దానికి ఆరు సంవత్సరాలు. ఈ చిరుత పులి ఇప్పటివరకూ తల్లికాలేకపోయింది. దీనికితోడు ప్రాకృతికంగానూ దానికి తల్లి అయ్యే వయసు కూడా దాటిపోయింది. 

దీంతో కిబీబీ నుంచి అండాన్ని, మరో మగ చిరుత నుంచి శుక్రకణాలను సేకరించి వాటిని కొలంబస్ జూ ల్యాబొరేటరీలో నవంబరు 19న ఫలదీకరణ చేశారు. ఈ భ్రూణాన్ని నవంబరు 21న సరోగేట్ చిరుత ఇజ్జీలో ప్రవేశపెట్టారు. తరువాత డిసెంబరు 23న అల్ట్రసౌండ్ పరీక్ష నిర్వహించగా..చిరుత గర్భం దాల్చిందని తేలింది. 

ఈ ప్రక్రియలో మరో విశేషమేమిటంటే చిరుత కడుపులో రెండు చిరుతలు ఉన్నాయని తేలింది.  గర్భధారణ జరిగిన మూడు నెలల తరువాత ఇజ్జీ ఒక మగ, ఒక ఆడ చిరుత కూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కొలంబస్ జూ అధికారులు తెలిపారు. జూపార్కుకు చెందిన పశువైద్యులు డాక్టర్ రాండి జంగ్ మాట్లాడుతూ.. ఈ ప్రక్రియ ద్వారా విభిన్న ప్రజాతుల మనుగడకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. 

Read More>>ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్(IOCL) లో అప్రెంటిస్ ఉద్యోగాలు

ఇప్పుడీ చిన్ని చిన్ని చిరుతలు పెద్దయ్యాక చాలా చురుకుగా ఉంటాయని అన్నారు. ఈ చిరుత పిల్లలు భవిష్యత్తులో జాతుల జనాభా పెరగటానికి స్ఫూర్తిగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. శాస్త్రవేత్తలు ఈ ప్రక్రియను ప్రయత్నించడం ఇది మూడవసారి. 1990 లో మొదటిసారి విజయవంతమైంది. అప్పుడు మూడు చిరుత పిల్లలు పుట్టాయి. ప్రస్తుతం ప్రపంచంలో 7500 చిరుతలు ఉన్నాయి. ఈ టెక్నిక్ వాటి సంఖ్యను పెంచడానికి సహాయపడుతుందని అన్నారు.