ఉరికంభం ఎక్కనున్న తొలి మహిళ, ప్రియుడితో కలిసి ఏడుగురిని చంపేసింది

ఉరికంభం ఎక్కనున్న తొలి మహిళ, ప్రియుడితో కలిసి ఏడుగురిని చంపేసింది

woman hanged : భారతదేశంలో తొలిసారిగా ఓ మహిళకు ఉరి శిక్ష అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఉరి శిక్ష అమలు చేయాలని మథుర కోర్టు ఆదేశించడంతో అందుకు తలారీ సిద్ధమౌతున్నాడు. ఇంకా డేట్ నిర్ణయించలేదు. అదే జరిగితే..దేశంలో ఉరికంభం ఎక్కిన తొలి మహిళగా చరిత్రలో నిలిచిపోనుంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆ మహిళ పేరు షబ్నమ్. ఈమె ఒకేసారి ఏడుగురిని హత్య చేసింది. చంపేసిన వారంతా..ఆమె కుటుంబసభ్యులే కావడం గమనార్హం. అందులో అభం..శుభం తెలియని చిన్నారి కూడా ఉంది.

అసలేం జరిగింది ? :-
యూపీలోని అమ్రోహా ప్రాంతానికి చెందిన ఇంగ్లీషులో ఎం.ఎ చేసిన షబ్నమ్..ఐదో తరగతి ఫెయిల్ అయిన సలీంను ప్రేమించింది. పెళ్లికి కుటుంబసభ్యులు నో చెప్పారు. ఆ యువకుడితో ఎలాంటి సంబంధాలు కొనసాగించవద్దని హెచ్చరించారు. అయినా..సరే..సలీంను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ప్రియుడి కలువనీయకుండా చేశారనే కోపంతో..షబ్నమ్ తన కుటుంబసభ్యులపై కోపం పెంచుకుంది. వారిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. రహస్యంగా ప్రియుడిని కలిసి తన ప్రణాళిక వివరించింది. 2008, ఏప్రిల్ 14వ తేదీ రాత్రి భోజనం చేసిన తర్వాత..తాగే పాలలో మత్తు మందు కలపడంతో కుటుంసభ్యులందరూ..గాఢ నిద్రలో జారుకున్నారు. తన ప్రియుడిని ఇంటికి రప్పించింది. సలీంతో కలిసి..వారందరినీ దారుణంగా చంపేసింది. మేనల్లుడైన చిన్నారిని కూడా వదిలిపెట్టలేదు.

మథుర హైకోర్టు సంచలన తీర్పు? :-
అనంతరం ఐదు రోజుల తర్వాత..షబ్నమ్ ను ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. హత్య కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. కేసు విచారణ జరిపిన అనంతరం మథుర హైకోర్టు 2010 జులై 14న నిందితులిద్దరికీ మరణశిక్షను విధిస్తూ..తీర్పును వెలువరించింది. దీన్ని సవాలు చేస్తూ అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది. అనంతరం సలీం, షబ్నమ్‌ లు 2015లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైంది. చివరకు అప్పటి రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీకి క్షమాభిక్ష పెట్టుకున్నారు. అది కూడా తిరస్కరణకు గురవ్వడంతో వీరిని ఉరి తీయడానికి మథుర జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్భయ కేసులో నిందితులను ఉరి వేసిన పవన్ జల్లాదే షబ్నమ్ ను ఉరి తీయనున్నారు. అయితే..ఇంకా తేదీ ఖరారు కాలేదు. స్వాతంత్య్రం తర్వాత ఉరిశిక్షకు గురైన తొలి మహిళగా షబ్నమ్ వార్తల్లోకి ఎక్కనుంది.