దత్తాత్రేయపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల దాడి

దత్తాత్రేయపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల దాడి

Congress హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు దాడి చేశారు. శుక్రవారం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్‌ స్పీచ్‌ అనంతరం సీఎంతో కలిసి బయటకు వెళ్తోన్న దత్తాత్రేయపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు దాడి చేశారు. గవర్నర్ తన వాహనం వద్దకు వెళుతున్నప్పుడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆయనను అడ్డుకుని, నెట్టేసినట్టు సమాచారం.

శుక్రవారం ఉదయం 11గంటలకు హిమాచల్ ప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో గవర్నర్ దత్తాత్రేయ బడ్జెట్ స్పీచ్ ఇస్తున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష నేత ముఖేష్ అగ్నిహోత్రి నేతృత్వంలోని కాంగ్రెస్ సభ్యులు తమ సీట్ల నుంచి లేచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి వారు పదే పదే అడ్డుతగిలారు. కాంగ్రెస్ సభ్యులు పదే పదే అడ్డుతగలడంతో గవర్నర్ తన ప్రసంగాన్ని క్లుప్తంగా ముగించారు.

దీంతో ప్రసంగానికి అడ్డుపడిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ముఖేశ్ అగ్నిహోత్రి, హర్ష్‌వర్దన్ చౌహన్, సత్పాల్ రైజాదా, సుందర్ సింగ్ ఠాకూర్, వినయ్ కుమార్‌లను మార్చి 20 వరకు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ విపిన్ పర్మార్ ప్రకటించారు. సస్పెన్షన్‌పై కాంగ్రెస్‌ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పీచ్‌ ముగించిన అనంతర దత్తాత్రేయ తన కారు దగ్గరకు వెళ్తుండగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆయనపై దాడి చేశారు. ఈ సమయంలో దత్తాత్రేయను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నెట్టేసినట్టు సమాచారం.

కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై అధికార బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ సభ్యుల తీరును ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ తీవ్రంగా ఖండించారు. కాగా, గవర్నర్‌ ప్రసంగంలో వెల్లడించిన విషయాలన్ని అబద్ధాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల సమస్యను ప్రసంగంలో చేర్చలేదన్నారు.