ఆవుదూడ కోసం ఐదుగురు మృతి..ఊరు ఊరంతా విషాదమే

  • Published By: nagamani ,Published On : September 9, 2020 / 09:55 AM IST
ఆవుదూడ కోసం ఐదుగురు మృతి..ఊరు ఊరంతా విషాదమే

ఓ ఆవుదూడ కోసం ఐదుగురి ప్రాణాలు బలైపోయాయి. ఆవుదూడ ఏంటీ ఐదుగురి చావుకు కారణం కావటమేంటి అనుకోవచ్చు..కానీ పాపం దాంట్లో ఆవుదూడ తప్పేమీ లేదు..ఓ బావిలో పడిపోయిన ఆవుదూడను కాపాడేందుకు వెళ్లినవారు మృత్యువాత పడ్డారు. ప్రాణాపాయంలో ఉన్న ఓ దూడను కాపాడుదామని పాపం వాళ్లు బావిలోకి దూకారు. దురదృష్టవశాత్తు వారు ఆ బావిలోనే మునిగి చనిపోయారు. గుండెలను పిండేస్తున్న ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా జిల్లా, మహారాజ్ గంజ్ సర్కిల్‌లో మంగళవారం (సెప్టెంబర్ 8,2020)చోటుచేసుకుంది.


మహారాజ్‌గంజ్ సమీపంలోని ఓ గ్రామంలో దూడ ప్రమాదవశాత్తు ఓ బావిలో పడిపోయింది. అటుగా వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు చూశారు. బావిలో విలవిలలాడుతున్న దూడను రక్షించాలనుకున్నారు. దూడను రక్షించాలనే తపనతో ఉన్నవారు తమకు ఈత రాదనే విషయం మరిచిపోయారు. కేవలం ఆవుదూడ ప్రాణాలు కాపాడాలనే అమాంతం బావిలోకి దూకేశారు. ఈత రాకపోవడంతో వారు ముగ్గురు నీటిలో మునిగిపోయారు.



https://10tv.in/tiktok-user-in-love-got-married-committed-suicide-in-guntur-district/
ఆ విషయం తెలిసిన గ్రామస్తులు భారీగా ఆ బావి వద్దకు చేరుకున్నారు. ఆ ముగ్గురిని రక్షించడానికి మరో ఇద్దరు బావిలోకి దిగారు..కానీ వారు కూడా బావిలో మునిగిపోయారు. దీంతో గ్రామస్తులు కంగారుపడిపోయారు. ఇంకెవరన్నా బావిలోకి దూకిని చనిపోతారనే భయంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.


వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సిబ్బంది సాయంతో ఐదుగురిని బావినుంచి వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. వారు అప్పటికే చనిపోయారని డాక్టర్లు చెప్పటంతో గ్రామం అంతా విషాదం నెలకొంది.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. కాగా..మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉండడంతో ఆ కుటుంబంలో బాధ వర్ణనాతీతంగా ఉంది. వారి రోదనలతో ఊరు ఊరంతా విషాదం నెలకొంది. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడంలేదు.

కాగా..ఈ విషాద ఘటనలకు కారణమైన ఆ ఆవుదూడను మాత్రం సజీవంగా బయటకు తీసుకొచ్చారు పోలీసులు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ నితిన్ బన్సాల్ తెలిపారు.బావిలో మునిగి మృతి చెందినవారిలో విష్ణు (28) కుమారుడు రామేశ్వర్, వైభవ్ (25) కుమారుడు బహదూర్, చోటు (32) కుమారుడు రామ్‌శంకర్, రింకు (42) కుమారుడు రామ్‌శంకర్ తో పాటు ఆ గ్రామంలోని స్కూల్ తోటమాలి మోను ఉన్నారు.