Election Results 2021 : 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. కౌంటింగ్ షురూ

దండలు ఎవరికి? దండన ఎవరికి? ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు? ఎవరిపై కరుణ చూపారు? కాసేపట్లో తేలిపోనుంది. 5 రాష్ట్రాల భవితవ్యం తేలనుంది. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ(మే 2,2021) వెలువడనున్నాయి.

Election Results 2021 : 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. కౌంటింగ్ షురూ

Election Results 2021

Five States Assembly Election Results 2021 : దండలు ఎవరికి? దండన ఎవరికి? ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు? ఎవరిపై కరుణ చూపారు? ఎవరిని తిరస్కరించారు. కాసేపట్లో 5 రాష్ట్రాల భవితవ్యం తేలనుంది. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ(మే 2,2021) వెలువడనున్నాయి. వెస్ట్ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అసోం రాష్ట్రాలకు.. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి వేర్వేరు విడతల్లో ఎన్నికలు జరిగాయి. 5 రాష్ట్రాల్లో మొత్తం 822 అసెంబ్లీ స్థానాల్లో విజేతలు ఎవరో తేలనుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు ఉప ఎన్నికల ఫలితాలు రానున్నాయి. కాగా, రిజల్ట్స్ ఎలా ఉండవచ్చో ఎగ్జిట్‌ పోల్స్‌ ఇప్పటికే అంచనా వేసిన విషయం తెలిసిందే.

ఓట్ల లెక్కింపు ఉదయం 8.00 గంటలకు ప్రారంభం అయ్యింది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంలను తెరిచి లెక్కించనున్నారు. మధ్యాహ్నం 12 తర్వాత తొలి ఫలితం వెలువడే అవకాశం ఉంది. మధ్యాహ్నాకి దాదాపు ఫలితాలపై అంచనా వస్తుంది.

ఎవరి అంచనాలు వారివి:
బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కొన్ని మాత్రం బీజేపీకి మొగ్గు ఉంటుందని చెప్పాయి. తమిళనాడులో మాత్రం డీఎంకే-కాంగ్రెస్ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని అన్ని సర్వేలూ ముక్తకంఠంతో తేల్చాయి. ఇటు కేరళలోనూ అధికార ఎల్డీఎఫ్ మరోసారి విజయం సాధించనుందని తెలిపాయి. అసోంలో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని కొన్ని, హంగ్ వస్తుందని మరికొన్ని సంస్థలు తెలిపాయి. ఇక, పుదుచ్చేరిలో బీజేపీ కూటమికే అధికారం దక్కుతుందని సర్వేలన్నీ వెల్లడించాయి. కాంగ్రెస్‌‌కు ఇక్కడ రిక్తహస్తమే మిగులుతుందని తెలిపాయి. అయితే, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? ఏమైనా ఊహించని మార్పులు ఉంటాయా? అనేది మరి కొద్ది గంటల్లో తెలిపోనుంది.

కరోనాను ఎదుర్కోవడంలో ప్రభుత్వాల తీరు గురించి ఓటర్ల మదిలో ఏముందనేది ఆదివారం నాటి ఫలితాల ద్వారా కొంతవరకు తెలుస్తుందనే అభిప్రాయాలూ ఉన్నాయి. ఎందుకంటే దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల్లో 78.22% వరకు కేవలం 11 రాష్ట్రాల్లో ఉన్నాయి. వాటిలో కేరళ, తమిళనాడు, బెంగాల్‌ ఉన్నాయి. పశ్చిమ్ బెంగాల్‌లో 294 స్థానాలు, తమిళనాడులో 234 స్థానాలు, కేరళలో 140, అసోం 126, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలున్నాయి. 5 చోట్ల కలిపి మొత్తం 822 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఓట్ల లెక్కింపులో లక్షకు పైగా సిబ్బంది, అధికారులు పాల్గొంటున్నారు.

అందరి చూపు బెంగాల్ వైపు:
ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మిగతావాటి కంటే.. దేశం యావత్తు బెంగాల్ ఎన్నికల ఫలితాలపైనే ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే బీజేపీ, టీఎంసీలు హోరాహోరీగా తలపడ్డాయి. బీజేపీ అగ్రనాయకత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఇక్కడ ప్రచారం నిర్వహించింది. అటు, మమతా కూడా సర్వశక్తులూ ఒడ్డి ఒంటరి పోరాటం చేశారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీ మరోసారి విజయం సాధిస్తారా, మోడీ-అమిత్‌షాల నేతృత్వంలో విస్తృతంగా సాగిన ప్రచారం ఫలిస్తుందా అనేది కొన్ని గంటల్లో తేలిపోనుంది. మమత తన రాజకీయ జీవితంలో ఇంతటి సవాల్‌ను ఎన్నడూ ఎదుర్కోలేదు.

సాగర్, తిరుపతిలో గెలుపెవరిది?
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగిన తిరుపతి పార్లమెంట్, నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానాల్లో ఇవాళ ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. పటిష్ట భద్రత, కఠిన కరోనా నిబంధనల మధ్య ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇక పార్టీలు గెలుపుపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ మాత్రం సాగర్ లో టీఆర్ఎస్, తిరుపతిలో వైసీపీ గెలుస్తాయని అంచనా వేశాయి. విజేత ఎవరనేది కాసేపట్లో క్లారిటీ రానుంది.

వివిధ కారణాల వల్ల ఈసారి ఈ బ్యాలెట్లు గతసారి కంటే నాలుగు రెట్లకు పైగా పెరిగాయి. వీటి లెక్క పూర్తయ్యాక ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను తెరవబోతున్నారు. కరోనా తీసుకొచ్చిన సమస్యలను, ఉన్నత న్యాయస్థానాల ఆదేశాలతో ఓట్ల లెక్కింపు బల్లల అమరిక నుంచి అన్నింటా అదనపు జాగ్రత్తలు తీసుకున్నారు. మధ్యాహ్నానికి ఓటర్ల తీర్పు సరళి, సాయంత్రం 5 గంటలకు పూర్తిస్థాయి ఫలితాలు వెలువడతాయని భావిస్తున్నారు. లెక్కింపును 1100 మంది పరిశీలకులు పర్యవేక్షిస్తారు. ఫలితాలను ఎప్పటికప్పుడు వెల్లడించడానికి వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. వెబ్‌సైట్‌, యాప్‌లలో తాజా సమాచారాన్ని అందుబాటులో ఉంచనుంది.