ఆకాశంలో త్వరలో రద్దీ, ఎగిరే కార్లకు అనుమతులు

ఆకాశంలో త్వరలో రద్దీ, ఎగిరే కార్లకు అనుమతులు

Flying Cars : ఎంతోకాలంగా ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎగిరే కారుకు అనుమతులు వచ్చేశాయి. సమీప భవిష్యత్తులో ఆకాశం ఎగిరేకార్లతో రద్దీగా మారబోతుంది. 10 వేల అడుగుల ఎత్తులో గంటకు వంద మైళ్లు ప్రయాణించే ప్రపంచంలోని తొలి ఎగిరే కారు టేకాఫ్‌కు అధికారిక క్లియరెన్స్ లభించింది. ఈ మేరకు అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ అనుమతులు మంజూరు చేసింది. టెర్రాఫుజియా ట్రాన్సిషన్ రోడబుల్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు ఎఫ్ఏఏ ప్రత్యేక లైట్-స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎయిర్‌వర్తీనెస్ సర్టిఫికెట్ జారీ చేసింది. విమానానికి ఉండాల్సిన అన్ని ప్రమాణాలు ఈ రోడబుల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఉండడంతో ఈ సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే, ప్రస్తుతానికి ఈ ఎగిరే కారుకు రహదారి అనుమతులు రానప్పటికీ త్వరలోనే అవి కూడా వస్తాయని చెబుతున్నారు.

ఈ ఎగిరే కారు రెక్కల పొడవు 27 అడుగులు. పైలట్లు, ఫ్లైట్ స్కూళ్ల కోసం ప్రస్తుతం ఇందులో ఫ్లైట్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ తీసుకోవాలనుకునే వారికి డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు పైలట్ సర్టిఫికెట్ కూడా ఉండాలని చైనీస్ కంపెనీ అయిన టెర్రాఫుజియా స్పష్టం చేసింది. ఈ ఎగిరే కారు తయారీలో పాలు పంచుకున్న బృందానికి టెర్రాఫుజియా అభినందనలు తెలిపింది. ఇప్పటికే ఈ ఎగిరే కారు 80 రోజుల ఫ్లైట్ టెస్టింగ్ పూర్తి చేసుకుందని సంస్థ జనరల్ మేనేజర్ కెవిన్ కోల్‌బర్న్ తెలిపారు.