కేంద్ర బడ్జెట్ : నిర్మలమ్మ పద్దు ఎందరి జీవితాల్లో వెలుగులు నింపుతుంది ?

కేంద్ర బడ్జెట్ : నిర్మలమ్మ పద్దు ఎందరి జీవితాల్లో వెలుగులు నింపుతుంది ?

FM Nirmala Sitharaman’s : మరి కొన్ని గంటలు మాత్రమే ఉంది. సరిగ్గా ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌. వంద ఏళ్ల చరిత్రలో కనివినీ ఎరుగని బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నా కొన్ని రోజుల క్రితమే ప్రకటన చేశారామె. దీంతో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. 1991-92 ఆర్థిక సంవత్సరానికి మన్మోహన్‌సింగ్ ప్రవేశపెట్టిన సంస్కరణల బడ్జెట్‌ కన్నా గొప్పగా ఉండనుందా నేటి బడ్జెట్‌. బడ్జెట్ కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ రంగాలు టీవీలకు అతుక్కుపోనున్న సమయం ఆసన్నమవుతోంది. ఉదయం 10 గంటల 15 పార్లమెంట్‌లోనే కేంద్ర కేబినెట్‌ సమావేశం కానుంది. బడ్జెట్‌ను ఆమోదించనుంది. ఆ తర్వాత సరిగ్గా 11 గంటలకు లోక్‌సభలో 2021-2022 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌.

ఆర్థిక రంగానికి టీకా : –
కోవిడ్‌ నిబంధనల మేరకు…ఈ సారి బడ్జెట్‌ ప్రతుల ముద్రణను పూర్తిగా నిలిపివేశారు. డిజిటల్‌ రూపంలోకి మార్చేశారు. బడ్జెట్‌ అంతా.. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో ఉంటుంది. ఇదిలా ఉంటే నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెడుతున్న మూడో బడ్జెట్‌ ఇది. గతేడాది కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ ఆంక్షలతో భారత ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. ఊహించని ఈ సంక్షోభం నుంచి బయటపడేయడానికి అప్పటికప్పుడు ఉద్దీపనలు ప్రకటించారు కానీ.. ఇప్పటికీ కరోనా ఎఫెక్ట్ కోట్లాదిమంది జీవితాలపై కనిపిస్తూనే ఉంది. ప్రాణాంతక మహమ్మారి కోవిడ్‌ కట్టడికి టీకా వచ్చేసింది కానీ.. ఆర్థిక రంగానికి ఎలాంటి టీకా ఇస్తారనేదే ఇప్పుడు 130 కోట్ల భారతావనని వేధిస్తున్న ప్రశ్న. వందేళ్ల చరిత్రలో కనివినీ ఎరుగని బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నానని నిర్మలా సీతారామన్‌ అన్నారు. కానీ…స్వతంత్ర్య భారతావనిలో ఇంతవరకు ఘనకీర్తిగా చెప్పుకునే బడ్జెట్‌ 1991-92 మధ్యకాలంలోనిదేనని ఆర్థికనిపుణులే కాదు…సామాన్యులూ భావిస్తారు.

1991 జులై 24న : –
పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు నాటి ఆర్థికమంత్రి మన్మోహన్‌సింగ్‌.. 1991 జులై 24న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఇప్పటికే గొప్పగా చెప్పుకుంటాం. నాటి బడ్జెట్‌ తర్వాత వస్తున్న 30వ బడ్జెట్‌ ఇది. 3 దశాబ్ధాల క్రితం మన్మోహన్‌ సింగ్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఇంతవరకు ఎందుకు ఘనంగా చెప్పుకుంటున్నామంటే దానికెన్నో కారణాలున్నాయి. 1991 జూన్ 21న పీవీ నరసింహారావు ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసేనాటికే భారత ఆర్థికవ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. అప్పుల ఊబిలో చిక్కుకుంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. కొత్తగా అప్పుపుట్టే పరిస్థితి లేదు. అలాంటి స్థితిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ద్వారాలు బార్లా తెరిచారు మన్మోహన్‌సింగ్‌. దీంతో ఆర్థికరంగం జవసత్వాలు సంతరించుకుంది.

సామాన్యులకు వరాలు ఉంటాయా : –
భారత్‌ ఆర్థికవ్యవస్థ పురోగమనబాటలో పయనించడం మొదలెట్టింది. అది కాస్తా దౌడ్ తీసేసరికి …అభివృద్ధి చెందిన దేశాలు ఈర్ష్యపడేస్థాయిలో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైంది. కోట్లాది మంది భారతీయులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. ఐదారు అంకెల జీతాలు ఆర్జించడం మొదలుపెట్టారు. మరిన్నాళ్లకు…ఇప్పుడు…కరోనా దెబ్బకు ఢీలా పడి డక్కాముక్కీలు తింటున్న ఆర్థికవ్యవస్థకు సరైన టీకా వేస్తారా నిర్మలా సీతారామన్. మన్మోహన్‌సింగ్‌ ను మరిపించేలా నేటి బడ్జెట్‌ ఉంటుందా? నవ ఆర్థికశకానికి నాందిపలికేలా, అమెరికా, చైనా, బ్రిటన్‌ ఆర్థికవ్యవస్థలను తలదన్నేలా భారత ఆర్థికరంగం పరుగులు పెట్టేలా బడ్జెట్‌లో ఏమన్నా ప్రకటించగలరా? సామాన్యులకు ఎలాంటి వరాలుంటాయి.? ఇవే ఇప్పుడు కోట్లాది మంది భారతీయులను ఆశగా టీవీలకు అతుక్కుపోయేలా చేస్తోంది.

ఎందరి జీవితాల్లో వెలుగులు : –
బడ్జెట్ అంటేనే ఏటా కొత్త ఆశలు పుట్టుకొస్తాయి. సామాన్యుల నుంచి పారిశ్రామిక వేత్తల వరకూ తమ కేంటి అనే ప్రశ్న వేసుకుంటారు. ఏడాది కాలంగా కరోనాతో అష్టకష్టాలు అనుభవించిన భారతీయుల్లో లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. ప్రజల ఆదాయం తగ్గింది. ఖర్చు పెట్టాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. అన్ని రంగాలు కుదేలై.. ఇప్పుడిప్పుడే దేశం మొత్తం న్యూ నార్మల్ దిశగా అడుగులేస్తున్న సమయంలో నిర్మలమ్మ పద్దు ఎందరి జీవితాల్లో వెలుగులు నింపుతుందనేది తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది.