కోవిడ్-19 పోర్టబుల్ హాస్పిటల్… ఐఐటీ మద్రాస్ స్టార్టప్ ఘనత

  • Published By: Chandu 10tv ,Published On : July 17, 2020 / 03:04 PM IST
కోవిడ్-19 పోర్టబుల్ హాస్పిటల్… ఐఐటీ మద్రాస్ స్టార్టప్ ఘనత

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ 19 సోకిన పేషెంట్లకు చికిత్సను అందించేందుకు కొత్త మెడికాబ్ పోర్టబుల్ హాస్పిటల్స్ ను ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీ-ఎం) తయారు చేసింది. ఈ దవాఖానాను కేవలం 4 గంటల్లో ఎక్కడైనా తయారు చేసుకునే వీలుంది. పోర్టబుల్ మెడికాబ్ హస్పటల్ ను కరోనాకు వ్యతిరేకంగా పోరాటంలో గేమ్ ఛేంజర్ అని భావించవచ్చు. అంతేకాకుండా కరోనా రోగులను స్థానికంగా గుర్తించడం, పరీక్షించడం, వేరు చేయడం, చికిత్స చేయడంలో మెడికాబ్ సహాయపడుతుంది.

ఇటీవల ఈ పోర్టబుల్ హాస్పిటల్ ను కేరళలోని వయనాడ్ లో ప్రారంభించారు. కరోనా రోగుల చికిత్స కోసం ఇటువంటి సూక్ష్మ హాస్పిటల్స్ అభివృద్ధి ఎంతో కీలకం కానున్నాయి. ఈ పోర్టబుల్ హాస్పిటల్స్ ని దేశవ్యాప్తంగా నగరాల్లో, గ్రామంలో ఎక్కడైనా సులభంగా నిర్వహించుకునే వీలున్నది. ఈ మెడికాబ్ లో డాక్టర్ రూమ్, ఐసోలేషన్ రూమ్, మెడికల్ రూమ్, వార్డ్, రెండు పడకలతో కూడిన ఐసీయూ ఉన్నాయి. ఈ పోర్టబుల్ దవాఖానాను రవాణా చేయటం చాలా సులువైనందున తక్కువ ఖర్చు అవుతుంది.

కేరళలోని షెల్టర్ లోని హబిటాట్ ఫర్ హ్యుమానిటీస్ టెర్విల్లిగర్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ మంజూరుతో ఈ విస్తరణ సాధ్యమైందని ఐఐటీ -ఎం గురువారం(జూలై16,2020) ఓ ప్రకటనలో తెలిపింది. ఐఐటీ -ఎం, స్టార్టప్ శ్రీ చిత్ర ఇన్ స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీతో కలిసి దీనిని తయారు చేయటం జరిగిందని తెలిపారు.

కేరళలో ఈ పైలట్ ప్రాజెక్టు ఫలితాలు సాంకేతిక పరిజ్ఞానం ప్రయోజనాలను, ప్రస్తుత సమయంలో మైక్రో హాస్పటల్ యెుక్క అవసరాన్ని వివరించగలవని స్మార్ట్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎసెన్షియల్ మాడ్యులస్ హౌసింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీరామ్ రవిచంద్రన్ అన్నారు. కరోనా వంటి అంటువ్యాధి సమయంలో స్క్రీనింగ్, చికిత్స చేయటం కోసం స్మార్ట్ హెల్త్ మౌలిక వసతుల అవసరం చాలా ఉన్నదని రవిచంద్రన్ చెప్పారు.