చైనాకు క్లారిటీగా,క్లియర్ గా తేల్చి చెప్పిన భారత్

  • Published By: venkaiahnaidu ,Published On : July 15, 2020 / 09:41 PM IST
చైనాకు క్లారిటీగా,క్లియర్ గా తేల్చి చెప్పిన భారత్

తూర్పు లఢక్ సరిహద్దులో యథాతథ స్థితిని పునరుద్ధరించాల్సిందేనని చైనాకు భారత్ స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖ(LAC)వెంట మే5కు ముందు ఉన్న శాంతి, ప్రశాంత వాతావరణం తిరిగి నెలకొనేందుకు సరిహద్దు నిర్వహణ కోసం పరస్పరం అంగీకరించిన అన్ని ప్రోటోకాల్స్‌ను చైనా తప్పక పాటించాలని క్లారిటీగాక్లియర్ గా తేల్చి చెప్పింది భారత్.

జూన్ 15న గాల్వన్ లోయలో భారత్, చైనా మధ్య జరిగిన భారీ ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది భారత జవాన్లు అమరులలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయికి చేరిన ఉద్రక్తతలను తగ్గించుకునేందుకు భారత్, చైనాకు చెందిన ఆర్మీ అధికారుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భారత వైపు వాస్తవాధీన రేఖ సమీపంలోని చు‌షుల్ సమావేశం పాయింట్ వద్ద లెఫ్టినెంట్ జనరల్ స్థాయిలో భారత్-చైనా దేశాల సైనికాధికారుల మధ్య మంగళవారం(జులై-14,2020)ఉదయం 11:30గంటలకు ప్రారంభమైన చర్చలు బుధవారం(జులై-15,2020)ఉదయం 2గంటలకు ముగిశాయి. 14.5 గంటలపాటు జరిగిన సుదీర్ఘ చర్చల్లో ఈ మేరకు భారత్ కచ్చితమైన సందేశాన్ని ఇచ్చింది.

భారత ప్రతినిధి బృందానికి లేహ్‌లోని 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నాయకత్వం వహించగా, సౌత్ జిన్జియాంగ్ సైనిక ప్రాంత కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్ చైనా తరుఫున నాయకత్వం వహించారు. సరిహద్దులో చైనీస్ పీపుల్స్ ఆర్మీ ఏర్పాటు చేసిన సైనిక శిబిరాలపై ఈ సందర్భంగా భారత ప్రతినిధి బృందం అభ్యంతరం తెలిపింది.

సరిహద్దు ప్రాంతంలోని మొత్తం పరిస్థితిని మెరుగుపరిచే బాధ్యత చైనాపైనే ఎక్కువగా ఉన్నదని తెలిపింది. పాంగోంగ్ త్సో, డెప్సాంగ్ వంటి అన్ని ఘర్షణ పాయింట్ల నుండి సమయ పరిమితి, ధృవీకరించదగిన విధంగాఎల్ఏసీ వెంబడి ఉన్న స్థావరాల నుంచి బలగాలు, ఆయుధాల ఉపసంహరణకు ఒక కార్యాచరణను సిద్ధం చేయాలని ఈ చర్చల్లో ఇరు దేశాలు నిర్ణయించాయి. దీనిపై ఉన్నతాధికారుల చర్చలు కొనసాగింపునకు పరస్పర సంప్రదింపులు కొనసాగించనున్నట్లు ఆర్మీ వర్గాలు చెప్పాయి.