Lakshadweep : లక్షద్వీప్ వివాదం..ప్రధానికి మాజీ ఉన్నతాధికారుల లేఖ

లక్షద్వీప్ ​లో అభివృద్ధి పేరుతో అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల ఖోడా పటేల్ తీసుకున్న వరుస వివాదాస్పద నిర్ణయాలు తీవ్ర ఆందోళన కలిగించేవిగా ఉన్నాయంటూ 93 మంది రిటైర్డ్ ఉన్నతాధికారులు ప్రధాని నరేంద్ర మోడీకి శనివారం ఓ లేఖ రాశారు.

Lakshadweep : లక్షద్వీప్ వివాదం..ప్రధానికి మాజీ ఉన్నతాధికారుల లేఖ

Lakshadweep

Lakshadweep లక్షద్వీప్ ​లో అభివృద్ధి పేరుతో అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల ఖోడా పటేల్ తీసుకున్న వరుస వివాదాస్పద నిర్ణయాలు తీవ్ర ఆందోళన కలిగించేవిగా ఉన్నాయంటూ 93 మంది రిటైర్డ్ ఉన్నతాధికారులు ప్రధాని నరేంద్ర మోడీకి శనివారం ఓ లేఖ రాశారు. వెంటనే ప్రఫుల్ ఖోడా పటేల్ ను లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ పదవి నుంచి తొలగించాలని కోరారు. లక్షద్వీప్‌ అడ్మినిస్ట్రేటర్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల స్థానిక ప్రజలే కాకుండా కేరళతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ‘సేవ్‌ లక్షద్వీప్‌’ వంటి ప్రచారాలను సోషల్‌ మీడియాలో హోరెత్తించారు. దీంతో మాజీ ఐఎఎస్‌, ఐపిఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులు కూడా లక్షద్వీప్‌లోని ప్రజలకు మద్దతుగా ప్రధాని మోడీకి లేఖ రాశారు.

లక్షద్వీప్ భౌగోళిక ప్రత్యేకతను, సాంస్కృతిక భిన్నత్వాన్ని కాపాడాలని లేఖలో మాజీ ఉన్నతాధికారులు కోరారు. స్థానిక ప్రజలను సంప్రదించిన తర్వాతే ఆ ప్రాంతానికి తగిన అభివృద్ధి నమూనాను ఎంపికచేయాలని, అక్కడి ప్రజల భద్రత, ఆరోగ్య పరిరక్షణ, విద్య, ఉపాధి అవకాశాల కల్పనకు భరోసా కల్పించాలని కోరుతూ ప్రధానికి రాసిన లేఖలో మాజీ ఉన్నతాధికారులు కోరారు. ప్రఫుల్‌ తీసుకున్న నిర్ణయాల్లో ప్రతి ఒక్కటి ద్వీప, ద్వీప ప్రజల విలువలను దెబ్బతిసేవిగా ఉన్నాయని లేఖలో స్పష్టం చేశారు. ఇక్కడి జనాభా, పరిమాణం, స్థితి గతులను అంచనా వేయకుండా అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని అన్నారు.

అడ్మినిస్ట్రేటర్‌ ప్రతిపాదించిన నిబంధనలు అక్కడి వారి ఆహారం, ఆహారపు అలవాట్లు, మతపరమైన అంశాలను లక్ష్యంగా చేసుకున్నట్లవుతుందని లేఖలో పేర్కొన్నారు. లక్షద్వీప్ లో 96.5 శాతం ముస్లింలే ఉన్నారని తెలిపారు. అక్కడ జంతు సంరక్షణ రెగ్యులేషన్‌ చట్టం ఆమోదం పొందితే…బొవిన్‌ వంటి జంతువులు చంపడంతో పాటు గొడ్డు మాంసం రవాణా, విక్రయం, స్టోరేజ్‌ చేయడం నిషేధం అవుతుందని అన్నారు. ఇటువంటి నిబంధనలు పొరుగు రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా లేవన్నారు. ఈ వివాదాస్పద నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, అక్కడి ప్రజల మనోభావాలను , సంస్కృతి అర్థం చేసుకునేలా పూర్తి స్థాయి అడ్మినిస్ట్రేటర్‌ను నియమించాలని కోరారు.

కాగా, ఈ లేఖ ప్రతులను కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్​ జావడేకర్​కు పంపించారు. జాతీయ భద్రత మాజీ సలహాదారు శివశంకర్​ మేనన్​, ప్రసార భారతి మాజీ సీఈవో జవహర్​ సర్కార్​, విదేశీవ్యవహారాల మాజీ కార్యదర్శి సుజాతా సింగ్​, ప్రధాన మంత్రి మాజీ సలహాదారు టి. కె. ఎ. నాయర్​, ప్రధాన సమాచార మాజీ కమిషనర్​ వజాహత్​ హబీబుల్లా తదితరులు లేఖపై సంతకాలు చేశారు.