బీజేపీ మహిళా నాయకురాలిని ‘ఐటమ్’ అంటూ.. మాజీ సీఎం అవమానకర వ్యాఖ్యలు

  • Publish Date - October 18, 2020 / 11:02 PM IST

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఉపఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్ కమల్ నాథ్‌ ఓ బీజేపీ అభ్యర్థిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 28 స్థానాల్లో ఉప ఎన్నికలు నవంబర్‌ 3న జరుగుతుండగా.. ఎన్నికల ప్రసంగంలో నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.



ఈ క్రమంలోనే కమల్ నాథ్ కూడా తన ప్రసంగంలో ఓ బీజేపీ మహిళా నాయకురాలిని ‘ఐటమ్’ అంటూ తప్పుగా పిలిచారు. దీనిపై ఆ రాష్ట్రంలోని బీజేపీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది.



మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ దాబ్రా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రసంగంలో భాగంగా కేబినెట్‌ మంత్రి ఇమ్రాతి దేవిపై ఆయన అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సభలో మాట్లాడుతూ “మన అభ్యర్థి ఎంతో నిరాడంబరమైన వ్యక్తి. ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న ఆమెతో పోల్చితే మన అభ్యర్థి గురించి తక్కువ చేసినట్లు అవుతుంది. ఇంతకీ ఆమె పేరేంటి…? అయినా నేను ఆమె పేరు ఎందుకు పలకాలి? ఏం ఐటమ్ అబ్బా.. ఏం ఐటమ్!” అంటూ అసభ్యకరమైన రీతిలో మాట్లాడారు.



దీనిపై సీరియస్ అయిన బీజేపీ వర్గాలు కమల్ నాథ్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. ఓ దళిత అభ్యర్థిపై అవమానకర మాటలు మాట్లాడిన కమల్ నాథ్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయకుండా నిషేధం విధించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇటీవల ఇమ్రాతి దేవి కాంగ్రెస్ వదిలి బీజేపీలో చేరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.



మధ్య ప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే మొత్తం 28 స్థానాల్లోనూ విజయం సాధించాలి. బీజేపీ తన అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే తొమ్మిది చోట్ల గెలిస్తే సరిపోతుంది.

ట్రెండింగ్ వార్తలు