భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

  • Published By: venkaiahnaidu ,Published On : August 31, 2020 / 06:01 PM IST
భారత మాజీ రాష్ట్రపతి  ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు. ఈ విషయాన్ని కొద్దిసేపటిక్రితం అయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ నెల 10న మెదడుకు శస్ర్తచికిత్స జరిగిన తరువాత కరోనా సోకడంతో గత 20 రోజులుగా ప్రణబ్.. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రెఫరల్‌ ‌ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా అయన డీప్ కోమాలోనే ఉన్నారు.

కాగా, ఇవాళ(ఆగస్టు-31,2020) మధ్యాహ్నం ప్రణబ్ ముఖర్జీ కన్నుమూసినట్లు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్వీట్ చేశారు. బరువెక్కిన హృదయంతో ఈ విషయాన్ని చెబుతున్నానని తెలిపారు. వైద్యులు ఆయన కోలుకోవాలని తీవ్రంగా శ్రమించారని, దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది కోరుకున్నారని.. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ హయాంలో సంక్షోభ పరిష్కర్తగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ తన రాజకీయ ప్రస్థానంలో అనేక పదవులను చేపట్టారు. రాజకీయల్లో వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు.

ప్రణబ్ కుమార్ ముఖర్జీ 1935, డిసెంబరు 11న పశ్చిమ బెంగాల్ లోని బిర్భుమ్ జిల్లా మిరాఠీ గ్రామంలో జన్మించారు. 2012 నుంచి 2017 వరకు భారతదేశ రాష్ట్రపతిగా ఉన్నారు. 2012లో ప్రతిభా పాటిల్ పదవీ విరమణ తరువాత ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవిని చేపట్టి 2017 వరకు కొనసాగారు. రాష్ట్రపతి పదవి చేపట్టకముందు 2009 నుంచి 2012 వరకు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2019లో ప్రతిష్టాత్మకమైన భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు.