Case Against Twitter : అశ్లీల కంటెంట్‌..ట్విట్టర్ పై మరో కేసు నమోదు

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు భారత్ లో వరుస షాక్ లు తగులుతున్నాయి.

Case Against Twitter :  అశ్లీల కంటెంట్‌..ట్విట్టర్ పై మరో కేసు నమోదు

Twitter (1)

Case Against Twitter సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు భారత్ లో వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే కొత్త ఐటీ రూల్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం- ట్విట్టర్‌ ల మధ్య వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్విట్టర్‌ను కేసుల బెడద వదలడం లేదు. తాజాగా ట్విట్టర్ పై ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్ మరో కేసు నమోదుచేసింది. భారత్ లో కంటెంట్ విషయంలో న్యాయ ర‌క్ష‌ణ‌ను కోల్పోయిన తర్వాత ట్విట్టర్ పై నమోదైన నాల్గవ కేసు ఇది.

ట్విట్టర్‌ లో బాలల అశ్లీల కంటెంట్‌ ఉంటోందని జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్(National Commission For Protection Of Child Rights)చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఢిల్లీ సైబర్‌ సెల్‌ పోలీసులు…మంగళవారం ట్విట్టర్‌పై పోస్కో యాక్ట్,ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. వాస్తవానికి ట్విట్టర్ కు వ్యతిరేకంగా NCPCR కొన్నిరోజుల కిందటే పలుమార్లు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఢిల్లీ సైబర్ పోలీసులు స్పందించకపోవడంతో NCPCR ఇవాళ ఢిల్లీ సైబర్ సెల్ డీసీపీ తమ ముందు హాజరుకావాలంటూ సమన్లు పంపింది. ఈ క్రమంలో ట్విట్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఢిల్లీ సైబర్ సెల్.

బాలల అశ్లీల కంటెంట్‌ విషయమై గతంలో ట్విట్టర్ కి కూడా NCPCR సమన్లు జారీ చేయగా.. ట్విట్టర్ ఇండియా,ట్విట్టర్ Inc రెండు వేర్వేరు బాడీస్ అని వెబ్ సైట్ లోని కంటెంట్ పై తమకు కంట్రోల్ లేదని ట్విట్టర్ సమాధానమిచ్చింది. అయితే ట్విట్టర్ ఇండియా యొక్క 99 శాతం షేర్లను ట్విట్టర్ Inc కలిగి ఉన్నట్లు NCPCR తమ విచారణలో గుర్తించింది.

మరోవైపు,భార‌త్‌లో అంతర్భాగమైన జమ్మూకశ్మీర్‌, లడఖ్ ల మ్యాప్‌ల‌ను త‌ప్పుగా చూపి ఇప్పటికే ట్విట్టర్ సంస్థ విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ విషయమై భజరంగ్‌ దళ్‌ నేత ప్రవీణ్‌ భాటి ఫిర్యాదు మేరకు ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ పై మంగళవారం యూపీలోని బులందర్‌షహర్‌ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైన విషయం తెలిసిందే.