ఎట్టకేలకు వరవరరావుకు స్వేచ్ఛ : అయినా..ముంబాయిలోనే

ఎట్టకేలకు వరవరరావుకు స్వేచ్ఛ : అయినా..ముంబాయిలోనే

Varavara Rao

Poet Varavara Rao : బీమా కొరేగావ్‌ కేసులో రెండేళ్లకు పైగా జైలులో ఉన్న రచయిత, సామాజిక కార్యకర్త 81 సంవత్సరాల వరవరరావుకు ఎట్టకేలకు స్వేచ్ఛ లభించింది. ఇటీవలే ఆయనకు తీవ్ర అనారోగ్యం బారినపడటంతో ముంబాయి హైకోర్టు ఆదేశాల మేరకు నానావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రెండు వారాల కిందట హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో…వరవరరావు కోలుకోవడంతో శనివారం రాత్రి 11.45 గంటలకు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

అయితే..బెయిల్ ఇచ్చే విషయంలో ముంబాయి హైకోర్టు పెట్టిన షరతుల మేరకు ఆయన అక్కడనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. జాతీయ దర్యాప్తు ఏజెన్సీ కోర్టుకు ఆయన పాస్‌పోర్ట్‌ను అప్పగించనున్నారు. వరవర రావు విడుదలైన విషయాన్ని ప్రముఖ మహిళా న్యాయవాది, సామాజిక ఉద్యమ కార్యకర్త ఇందిరా జైసింగ్ ధృవీకరించారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు. నానావతి ఆసుపత్రి నుంచి వరవర రావు విడుదలయ్యారని పేర్కొంటూ ఆయన తాజా ఫొటోను పోస్ట్ చేశారు. తమ తండ్రిని విడుదల చేయాలని వరవరరావు కుమార్తెలు ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, గవర్నర్ లకు లేఖలు రాశారు.

నవంబర్ 17, 2018న వరవరరావును.. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పూణె పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాని మోదీని హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు ఆయనపై అభియోగాలు మోపారు. 2018 జనవరి 01వ తేదీ మహారాష్ట్రలో పూణే సమీపంలో భీమా – కోరెగావ్ లో ఓ ఉత్సవాల్లో హింస చెలరేగింది. ఈ కేసులో జూన్‌లో ఐదుగురిని అరెస్ట్ చేశారు పూణె పోలీసులు.

వారిలో ఒకరి ఇంట్లో ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నిన ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. రాజీవ్‌గాంధీని హత్య చేసినట్లే.. ప్రధాని మోదీ ని కూడా హతమార్చాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖలోనే వరవరరావు పేరు కూడా ఉండడంతో ఆయనపైనా కేసు నమోదయ్యింది. అయితే.. ఈ ఆరోపణలను వరవరరావు ఖండించారు. తాను ఎవరి హత్యకు కుట్ర పన్నలేదన్నారు. అప్పటి నుంచి ఈ కేసు దర్యాప్తు జరుగుతూనే ఉంది.