బీజేపీతో పొత్తుపై జేడీయూలో లుకలుకలు…పార్టీ మారవచ్చన్న నితీష్

  • Published By: venkaiahnaidu ,Published On : January 23, 2020 / 09:47 AM IST
బీజేపీతో పొత్తుపై జేడీయూలో లుకలుకలు…పార్టీ మారవచ్చన్న నితీష్

బీహార్ రాజకీయాల్లో కొన్ని రోజులుగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ సీఏఏ,ఎన్ఆర్సీ విషయంలో కాంగ్రెస్ ను పొగుడుతూ భాగస్వామ్య పక్షమైన బీజేపీని విమర్శిస్తూ వస్తున్నారు. అయితే రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సింహభాగం సీట్లు తమకు కేటాయిస్తేనే బీజేపీతో పొత్తు లేకుంటే లేదు అన్నట్లు ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జేడీయూ పొత్తుపై ఆ పార్టీలోని లుకలుకలు క్రమంగా బయటపడుతున్నాయి. బీజేపీతో పొత్తుపై జేడీయూ నేతల మధ్య ఘర్షణ పెరుగుతోంది. 

పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల పట్టిక, జాతీయ జనాభా పట్టికల విషయంలో నిరసనలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో ఢిల్లీ శాసన సభ ఎన్నికల కోసం బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని జేడీయూ జనరల్ సెక్రటరీ పవన్ వర్మ అధిష్ఠానాన్ని నిలదీశారు. నితీశ్ కుమార్‌కు తాను రాసిన లేఖను పవన్ వర్మ ట్వీట్ చేశారు. జేడీయూ, బీజేపీ పొత్తుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ లేఖను పవన్ వర్మ బాహాటంగా వెల్లడించడం పట్ల జేడీయూ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

ఈ సమయంలో పవన్ వర్మ తీరును ఆ పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు. తనతో వ్యక్తిగత సంభాషణలను బాహాటంగా వెల్లడించిన పవన్‌కు తన ఆశీర్వాదాలు ఉంటాయని చెప్తూ, ఆయన పార్టీ మారాలనుకుంటే, వెళ్ళిపోవచ్చునని చెప్పారు. నితీశ్ కుమార్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఎవరికైనా అసంతృప్తి ఉంటే, దానిని వ్యక్తపరిచే విధానం ఇది కాదన్నారు. పవన్ వర్మతో నేను కొన్ని విషయాలు చెప్పానని అంటున్నారు. ఆయన నాతో ఏం చెప్పారో నేను మీకు చెప్పాలా? నేను ఆయనను గౌరవిస్తాను. వేరొక పార్టీలోకి వెళ్ళాలని ఆయన కోరుకుంటే, అది ఆయన నిర్ణయం. ఆయనకు నా ఆశీర్వాదాలు ఉంటాయి అని నితీష్ అన్నారు.

ఫిబ్రవరి-8,2020న జరిగే ఢిల్లీ శాసన సభ ఎన్నికల కోసం బీజేపీ-జేడీయూ-ఎల్‌జేపీ పొత్తు పెట్టుకున్నాయి. జేడీయూ 2 స్థానాల నుంచి, ఎల్‌జేపీ ఒక స్థానం నుంచి పోటీ చేస్తాయి. ఫిబ్రవరి-11,2020న ఫలితాలు వెలువడనున్నాయి. మరోవైపు బీజేపీ ఇప్పటికే ఢిల్లీ ఎన్నికల కోసం 40మంది స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దించింది. మరోవైపు ఆప్ కు తానే స్టార్ క్యాంపెయినర్ అనే రీతిలో కేజ్రీవాల్ ప్రచారం సాగుతోంది. ఇక కాంగ్రెస్ ను నాయకత్వ లేమి వెంటాడుతోంది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ ను పక్కకు నెట్టేసి బీజేపీ తర్వాత ఓటింగ్ శాతంలో రెండోస్థానంలో నిలిచిన కాంగ్రెస్…ఈ సారి దశాబ్దాల పాటు ఏలిన ఢిల్లీ సింహాసనాన్ని దక్కించుకునేందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తోందో చూడాలి.