Orphaned Children: కరోనాతో అనాథలైన పిల్లలకు స్మార్ట్ ఫోన్‌లు

Orphaned Children: కరోనాతో అనాథలైన పిల్లలకు స్మార్ట్ ఫోన్‌లు

Orphaned Children

Orphaned Children: కరోనా కారణంగా చాలా కుటుంబాలు ఇంటి పెద్ద దిక్కును కోల్పోయాయి. ఇక మరికొన్ని కుటుంబాలు సంపాదించి ఇంటిని నడిపే వారిని కోల్పోయాయి. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన చిన్నారులు చాలామంది ఉన్నారు. వీరి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కరోనాతో అనాథలుగా మారిన పిల్లలకు ఆర్ధిక భరోసా ఇచ్చింది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారిని ఆదుకునేందుకు ముందుకు వస్తున్నాయి.

వీటికి స్వచ్చంద సంస్థలు కూడా జతకలిసాయి. పలు స్వచ్చంద సంస్థలు కరోనా కారణంగా అనాథలుగా మారిన పిల్లలను చదివించేందుకు ముందుకు వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం కరోనా అనాథ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వనుంది. వీరి వద్ద స్మార్ట్ ఫోన్స్ ఉంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు అధికారులకు తెలియచేసేందుకు స్మార్ట్ ఫోన్ బాగా ఉపయోగపడుతుందని తెలంగాణ ప్రభుత్వం భావించి వారికి ఫోన్లు అందించేందుకు సిద్ధమైంది. ఇక ఇప్పటికే అనాథ పిల్లల వివరాలు సేకరించారు అధికారులు. హైదరాబాద్ నగరంలో కరోనా కారణంగా 85 మంది పిల్లలు అనాథలైనట్లు గుర్తించారు.

తల్లిదండ్రుల్లో ఒకరు మరణించిన వారు కూడా ఉన్నారు. ఇక స్వచ్చంద సంస్థల సహాయంతో వారికి రేషన్ సరుకులు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే వీరికి స్మార్ట్ ఫోన్స్ అందిస్తామని హైదరాబాద్ జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వరరావు వెల్లడించారు. అనాథ పిల్లలను రేషిడెన్షియల్ స్కూల్ లో చేర్పించి విద్యనందిస్తామని వివరించారు.