మెట్రో ఫ్రీ జర్నీ ఎలా ఇస్తారు : సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం షాక్

  • Published By: madhu ,Published On : September 6, 2019 / 10:05 AM IST
మెట్రో ఫ్రీ జర్నీ ఎలా ఇస్తారు : సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం షాక్

ఉచిత హామీలిచ్చిన సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం అన్న ప్రతిపాదనలపై కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ఉచిత పథకాలకు ప్రజాధనం వృధా చేయొద్దని హితవు పలికింది. గత సంవత్సరం ఢిల్లీ మెట్రో రూ. 100 కోట్ల నష్టాన్ని చవి చూసిందని, మహిళలకు ఉచిత జర్నీ కల్పిస్తే రూ. 1,500 కోట్లకు నష్టం చేరనుందని అంచనా. దీనిపై సుప్రీం విచారించింది. 

దీర్ఘకాలిక రుణాలు చెల్లింపులు, మెట్రో విస్తరణ, సదుపాయాలు, సేవలపై నష్టాల ప్రభావం చూపనుందని తెలిపింది. డీఎంఆర్‌సీకి లాభాదాయకమైంది కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రాజెక్టుకు సంబంధించిన భూమి ఖర్చును కేంద్రం, ఢిల్లీ  ప్రభుత్వం 50 : 50 నిష్పత్తిలో భరించాలని సూచించింది. ఫేస్ IV మెట్రోలో ఎలాంటి ఆలస్యం జరగకుండా చూసుకోవాలని జస్టిస్ అరుణ్ మిశ్రా, దీపక్ గుప్తా ధర్మాసనం బెంచ్ తెలిపింది. మూడు వారాల్లో భూమి వ్యయం (రూ. 2 వేల 447) విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశించింది. 

దేశ రాజధానిపై మరోసారి పాగా వేసేందుకు సీఎం కేజ్రీవాల్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. జనాలను ఆకర్షించేందుకు పలు పథకాలను ప్రకటిస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కేజ్రీవాల్ అలాంటి పరిస్థితి మరోసారి రావొద్దని వ్యూహాలు రచిస్తున్నారు. ఉచిత హామీలను ప్రకటిస్తున్నారు. మహిళలకు మెట్రో రైళ్లు, బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రకటించిన సంగతి తెలిసిందే.

అంతేకాదు 200 యూనిట్ల వరకు ఉచితంగా, 400 యూనిట్లలోపు 50 శాతం సబ్సిడీతో విద్యుత్‌ను అందించే పథకాన్ని ప్రకటించారు. దేశ రాజధానిలో 11 వేల ఉచిత wifi హాట్ స్పాట్‌లను ఏర్పాటు చేయనున్నట్లు..ఇందుకు ప్రతి నెలా 15 జీబీ డేటాను ఉచితంగా వాడుకొనేలా చేస్తామని ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. కేజ్రీవాల్ ప్రకటిస్తున్న ఉచిత హామీలపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన ఇన్ని రోజుల తర్వాత విషయాలు గుర్తుకొస్తున్నాయా అంటూ బీజేపీ ప్రశ్నిస్తోంది. ప్రజలను మభ్యపెట్టేందుకు సీఎం కేజ్రీవాల్ మరోసారి ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. 
Read More : తీహార్ జైల్లో ఖైదీల మధ్య చిదంబరం పుట్టినరోజు