Dragon Fruit : సంక్షోభం నుండి లాభాలవైపు…డ్రాగన్ ఫ్రూట్ సాగుతో లక్షాధికారిగా…

సాగు కోసం ఐఎస్‌ఐఎస్‌ గోల్డ్‌ అనే ఆస్ర్టేలియన్‌ వెరైటీ మొక్కలను గుజరాత్‌ నుంచి తెప్పించాడు. ఈ డ్రాగన్‌ఫ్రూట్‌ పసుపుపచ్చని రంగులో ఉంటుంది.

Dragon Fruit : సంక్షోభం నుండి లాభాలవైపు…డ్రాగన్ ఫ్రూట్ సాగుతో లక్షాధికారిగా…

Dragan Fruit

Dragon Fruit : సాధారణ పంటలసాగుతో సరైన ఫలసాయంతోపాటు అదాయం రాని పరిస్ధితుల్లో ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులు దృష్టిసారిస్తున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావుపేటకు చెందిన ద్యావ రాంచంద్రారెడ్డి 20 ఎకరాల భూమిలో డ్రాగన్ ఫ్రూట్ సాగుతో లాభాలనార్జిస్తూ తన తోటి రైతులకు ఆదర్శంగా మారారు. రాంచంద్రారెడ్డి, ఆయన భార్య సునిత ఇద్దరూ వ్యవసాయానికే అంకితమై పండ్ల తోటల సాగుపై దృష్టిసారించారు. డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు గురించి వార్తా పత్రికలో చదివిన వెనువెంటనే. డ్రాగన్‌ ఫ్రూట్‌ గురించి తెలుసుకోవటం ప్రారంభించాడు. నాలుగేళ్ళ సమయం డ్రాగన్ ఫ్రూట్ సాగుగురించి లోతుగా పరిశీలన జరిపాడు.

ఆంధ్రా ప్రాంతంలో సాగులో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ తోటలను చూసి వారి వద్ద సాగు పద్దతులు, మార్కెటింగ్‌, విత్తనాల లభ్యత తదితర అంశాలను తెలుసుకొని 2018లో ఎకరంన్నర భూమిలో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేపట్టాడు. మొదటి సంవత్సరం ఎకరాకు అరటన్ను దిగుబడి మాత్రమే వచ్చింది. ఆ పండు గురించి అందరికీ తెలియకపోవడంతో మార్కెటింగ్‌ కష్టమై డోర్‌ డెలివరీ ఇచ్చి అమ్ముకోవలసి వచ్చింది. ప్రస్తుతం డ్రాగన్‌ ఫ్రూట్‌ గురించి ప్రజల్లో అవగాహన పెరిగి అందరూ అడుగుతుండడంతో తోట వద్దే 30 శాతం పంట అమ్ముడవుతోంది. రెండున్నర ఎకరాల తోటలో ఆయన 12 టన్నుల దిగుబడి సాధించాడు. టన్నుకు 1,40,000 చొప్పున 16 లక్షల 80వేల రూపాయల ఆదాయాన్ని పొందారు. లక్షన్నర రూపాయల ఖర్చులు పోను ఆయనకు నికరంగా 15 లక్షల లాభం చేకూరింది. ఆయన ప్రస్తుతం అమెరికన్‌ బ్యూటీ, సియామ్‌ రెడ్‌, థైవాన్‌ పింక్‌ రకాల డ్రాగన్‌ఫ్రూట్‌ సాగు చేస్తున్నాడు.

సాగు కోసం ఐఎస్‌ఐఎస్‌ గోల్డ్‌ అనే ఆస్ర్టేలియన్‌ వెరైటీ మొక్కలను గుజరాత్‌ నుంచి తెప్పించాడు. ఈ డ్రాగన్‌ఫ్రూట్‌ పసుపుపచ్చని రంగులో ఉంటుంది. 17 వేల రూపాయలు వెచ్చించి ఆయన ప్రయోగాత్మకంగా సాగు చేసేందుకు వంద మొక్కలను తెప్పించారు. ఎకరాకు ఎనిమిది నుంచి పది టన్నుల దిగుబడి వచ్చేలా చూసుకుంటే మార్కెట్‌లో కేజీ 50 రూపాయల చొప్పున టన్నుకు 50 వేల రూపాయల రేటు ఉన్నా కనీసం 4 నుంచి 5 లక్షల రూపాయలు ఆదాయం పొందవచ్చని రాంచంద్రారెడ్డి అంటున్నారు. అదే ఎకరంలో వరి సాగు చేస్తే 40 వేల రూపాయలు, పత్తిసాగు చేస్తే 50 నుంచి 60 వేల రూపాయలకు మించి ఆదాయం రాదని ఆయన చెబుతున్నారు. ఏ రకంగా చూసుకున్నా సాంప్రదాయ పంటలకంటే డ్రాగన్‌ఫ్రూట్‌ సాగు మేలని ఆయన రైతులకు సూచిస్తున్నారు.

అదే క్రమంలో ఎనిమిది ఎకరాల్లో మస్క్‌మిలన్‌ సాగును చేపట్టారు. కోహినూర్‌, సన్‌స్టార్‌ రకాల మస్క్‌ మిలన్‌ను సాగు చేశాడు. పోషక పదార్థాలు, మెడిసనల్‌ వాల్యూస్‌ ఉన్న ఈ పండు వినియోగం ఢిల్లీతోపాటు ఉత్తరాదిలో ఎక్కువగా ఉంటుంది. 60 నుంచి 65 రోజుల్లోనే మస్క్‌మిలన్‌ ఎకరాకు 15 టన్నుల దిగుబడి వచ్చింది. కిలోకు 45 రూపాయల చొప్పున టన్నుకు 45 వేల రూపాయలు చొప్పున ఎకరాకు ఆరు లక్షల 75వేల ఆదాయం సమకూరింది. డ్రాగన్‌ ఫ్రూట్‌, మస్క్‌మిలన్‌ పంటలతో ఒక్క క్రాప్‌లోనే 50 లక్షలకు పైగా సంపాదించుకున్న రాంచంద్రారెడ్డి ఈసారి మస్క్‌మిలన్‌ను మరో నాలుగు ఎకరాలు పెంచి 12 ఎకరాలలో సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు.

చలి ప్రాంతాల్లో పండే యాపిల్‌ నవంబరు నుంచి జనవరి వరకు దిగుబడి ఇస్తుండగా ఉష్ణప్రాంతాలలో జూన్‌, జూలై, ఆగస్టు మాసాల్లో పంట కోతకు వస్తుంది. ఆ టైంలో బయటి నుంచి యాపిల్‌ రాక పోవడంతో కిలోకు 100 రూపాయలకు తగ్గకుండా అమ్ముకునేందుకు అవకాశముంటుందని గ్రహించి రాంచంద్రారెడ్డి హెచ్‌ఆర్‌ఎంఎన్‌ 99 అనే రకం సాగు చేశాడు. నాలుగు సంవత్సరాల్లో యాపిల్‌ పండ్లు చేతికి రావడం ప్రారంభమై ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాల వరకు మొక్కకు వంద కేజీల చొప్పున దిగుబడి వస్తుందని ఆయన చెబుతున్నారు. రెండున్నర ఎకరాల్లో యాపిల్‌ తోట పెట్టాలని నిర్ణయించుకొని ఇప్పటికే 30 గుంటల్లో ఆ మొక్కలను నాటి ఏడాదికాలం పూర్తయ్యింది.

పది ఎకరాల్లో 50 లక్షలకు పైగా ఆదాయం పొందానని తనకున్న 20 ఎకరాలతోపాటు మరో 10 ఎకరాలు లీజుకు తీసుకొని ఇతర పంటలు సాగు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాడు రామచంద్రారెడ్డి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కంటే తాను అధిక అదాయం సంపాదిస్తున్నట్లు గొప్పగా చెప్తున్నాడాయన.