స్వీపర్‌గా పనిచేసిన చోటే ఇప్పుడు ప్రెసిడెంట్

స్వీపర్‌గా పనిచేసిన చోటే ఇప్పుడు ప్రెసిడెంట్

Sweeper to Panchayat President: నిన్నటివరకు ఆమె ఒక తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికురాలు. పంచాయితీ ఆఫీసులోని ఫోర్లు తుడిచేది..కుర్చీల దుమ్ము దులిపేది. కానీ,ఇప్పుడు పని చేస్తున్న బ్లాకు పంచాయతీకే అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు దుమ్ము దులిపిన కుర్చీలోనే ఇప్పుడామె కూర్చొని..అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆమే కేరళకు చెందిన దళిత మహిళ “ఆనందవల్లి”. ప్రజాస్వామ్యం..రాత్రికి రాత్రే మనుషుల జీవితాలను మార్చేస్తుందనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పవచ్చు.

కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాలోని పతనపురం బ్లాకు పంచాయతీలో ఏ.ఆనందవల్లి(46)గత 10ఏళ్లుగా పార్ట్ టైమ్ పారిశుద్ధ్య కార్మికురాలుగా పని చేస్తున్నారు. “వల్లి చేచి”గా కూడా ఆనందవల్లికి మరొక పేరు ఉంది. ప్రజల్లో ఆమెకు ఉన్న మంచిపేరుని గుర్తించిన ఎల్డీఎఫ్(Left Democratic Front)ఆమెను రాజకీయాల్లోకి ఆహ్వానించింది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో సీపీఎ(మార్కిస్ట్) తరఫున తల్లవూర్ వార్డు(ఎస్పీ రిజర్వ్డ్) నుంచి ఆనందవల్లి పోటీచేసి…654 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. 13 సభ్యుల పంచాయతీలో లెఫ్ట్ కూటమి ఏడు సీట్లలో విజయం సాధించగా..కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్(United Democratic Front)మిగిలిన ఆరు స్థానాల్లో విజయం సాధించింది.

పంచాయత్ ప్రెసిడెంట్ పోస్టు ఎస్పీ మహిళకి రిజర్వ్ చేయబడింది. అయితే ఎల్డీఎఫ్ నుంచి ఎస్పీ కమ్యూనిటీకి చెందిన మరో మహిళ కూడా వార్డు సభ్యురాలిగా విజయం సాధించినప్పటికీ..ఆనందవల్లివైపే సీపీఎం మొగ్గుచూపింది. గెలిచిన అందరూ కూడా బ్లాకు పంచాయతీకే అధ్యక్షురాలుగా ఆనందవల్లినే కోరుకున్నట్లు సమాచారం. దీంతో బుధవారం ఆనందవల్లి..తను 10ఏళ్లుగా స్వీపర్ గా పనిచేసిన అదే ఆఫీసులో బ్లాకు పంచాయితీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేసిన ఆనందవల్లి..చిన్నస్థాయి నుంచి అధ్యక్షురాలుగా ఎన్నికవడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. మొదట్లో తాను కొంచెం భయపడ్డానని..అయితే పార్టీ పెద్దలు,శ్రేయోభిలాషులు అందరూ కలిసి కొత్త బాధ్యతలు చేపట్టేలా ప్రోత్సహించారని ఆనందవల్లి తెలిపారు. తన బ్లాక్ పంచాయత్ ని ఓ రోల్ మోడల్ గా మార్చేందుకు తాను చేయగలిగదంతా చేస్తానని ఆనందవల్లి అన్నారు. గత పదేళ్లుగా పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్న ఆమె ఎన్నికపై కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఆమె భర్త మోహన్​ పెయింటింగ్​ పని చేస్తారు. సీపీఎం స్థానిక కమిటీ సభ్యుడు కూడా.

మరోవైపు,ఇటీవల 21ఏళ్ల విద్యార్థిని తిరువనంతపురం మేయర్ గా బాధ్యతలు చేపట్టి దేశంలోనే అత్యంత పిన్న వయస్సులో మేయర్ గా ఎన్నికైన వ్యక్తిగా రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే.