డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకున్నా కోవిడ్ పరీక్షలకు అనుమతి

  • Published By: murthy ,Published On : July 8, 2020 / 09:20 AM IST
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకున్నా కోవిడ్ పరీక్షలకు అనుమతి

ముంబై మహా నగరంలో నేటి నుంచి కోవిడ్ -19 పరీక్ష చేయటానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదని బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) మంగళవారం నిర్ణయించింది. నగరంలో కోవిడ్ -19 పరీక్షల సంఖ్యను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

అంతకుముందు, కోవిడ్ లక్షణాలు ఉన్న రోగులు మరియు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ఉన్నవారికి మాత్రమే పరీక్షలు నిర్వహించేవారు. కరోనా వైరస్ పరీక్ష కోసం డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌ను తొలగించమని రాష్ట్రాలను కోరుతూ ఇటీవల ఐసిఎంఆర్ మార్గదర్శకాలను జారీ చేసిన నేపధ్యంలో ముంబై మున్సిపల్ కార్పోరేషన్ ఈ ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ పరీక్ష చేయించుకోవాలనుకునే వారికి ఇది ఉపశమనంగా ఉంటుంది.

ముంబైలో ప్రైవేట్ లేబరేటరీల సంఖ్య పెరగడం, వాటి సామర్థ్యం దృష్ట్యా డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే పరీక్షను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ ఒక ప్రకటనలో తెలిపారు.

కోవిడ్ -19 పరీక్ష కోసం, ప్రైవేట్ ల్యాబ్‌లు ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు రూ. 2,500(ల్యాబ్ కు వచ్చి టెస్ట్ ఇస్తే), ఇంటకి వెళ్లి శాంపిల్ సేకరించి పరీక్ష నిర్వహిస్తే రేటు రూ. 2,800 వసూలు చేయాలని తెలిపింది. నగరంలో ఇప్పటివరకు 3,63,120 పరీక్షలు జరిగాయని బీఎంసీ తెలిపింది.

మంగళవారం, ముంబైలో 806 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది గత రెండు నెలల్లో నమోదైన కేసుల్లో అతి తక్కువ కేసులు. ముంబైలో మొత్తం కేసుల సంఖ్య 86,132 గా ఉంది.

ప్రిస్క్రిప్షన్ లేకుండా నగరంలోని ఏ వ్యక్తికైనా కరోనా పరీక్ష చేయాలని ముంబై మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించటం పట్లం సబర్బన్ జిల్లా సంరక్షక మంత్రి ఆదిత్య ఠాక్రే హర్షం వ్యక్తం చేశారు. ల్యాబ్‌లు ఇప్పుడు ICMR మార్గదర్శకాల ప్రకారం పరీక్షలను నిర్వహిస్తాయని…. ఇది ప్రజలు సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుందని ఆయన ట్వీట్ చేశారు.

Read Here>>గుడ్ న్యూస్, కరోనా మందు రెమ్‌డెసివిర్‌ తొలి బ్యాచ్‌ను సిప్లాకు పంపిన సావరిన్ ఫార్మా