ఏం చెప్తిరి..ఏం చెప్తిరి.. చలికాలం పోతే పెట్రోల్ ధరలు తగ్గుతాయన్న కేంద్రమంత్రి, సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు

ఏం చెప్తిరి..ఏం చెప్తిరి.. చలికాలం పోతే పెట్రోల్ ధరలు తగ్గుతాయన్న కేంద్రమంత్రి, సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు

fuel-prices

fuel prices will come down as winter ends: దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయ్‌. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది. మండిపోతున్న ఇంధన ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. వాహనాలు బయటకు తియ్యాలంటేనే వణికిపోతున్నారు. ధరల తగ్గింపు విషయంలో అటు కేంద్రం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏమైనా ప్రకటన చేయకపోతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు జనాలు. కానీ, వారి ఆశలు అడియాసలే అవుతున్నాయి.

పెట్రోల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయంటే..
ఇదిలా ఉంటే, పెట్రోల్ ధరలు పెరగడానికి కారణం ఏంటి? పెట్రోల్ ధరలు ఎప్పుడు తగ్గుతాయి.. అనేదానిపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే…

చలికాలం పోతే పెట్రోల్ ధరలు తగ్గుతాయి:
”అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు పెరగడం వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడుతోంది. శీతాకాలం పోతే పెట్రోల్‌ ధరలు దిగి వస్తాయి. అయినా, ఇది అంతర్జాతీయ వ్యవహారం. డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్నిదేశాల్లోనూ పెట్రోలియం ఉత్ప‌త్తుల‌కు శీతాకాలంలో డిమాండ్‌ అధికంగా ఉంటుంది. ఈ సీజన్‌ పూర్తయితే పెట్రో ఉత్పత్తులకు డిమాండ్ తగ్గుతుంది, దాంతో ధరలు దిగివస్తాయి. పెట్రో ధ‌ర‌ల పెంపున‌కు దేశీయ ప‌రిస్థితులు ఏమాత్రం కార‌ణం కాదు’’ అని మంత్రిగారు వివరించారు.

ఏం చెప్తిరి.. ఏం చెప్తిరి..
కేంద్రమంత్రి చేసిన ప్రకటన వైరల్ గా మారింది. దీనిపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. పొంతన లేని సమాధానాన్ని మంత్రి ఇచ్చారని విమర్శలు చేస్తున్నాయి. ఏమాత్రం బాధ్యత లేకుండా మంత్రిగారు మాట్లాడారని తిట్టిపోశాయి. మంత్రిగారి కొత్త భాష్యంపై సోషల్ మీడియాలోనూ సెటైర్లు
పేలుతున్నాయి. ఏం చెప్తిరి..ఏం చెప్తిరి.. అని జనాలు కామెడీ చేస్తున్నారు. మరి మంత్రిగారు సెలవిచ్చినట్లు.. శీతాకాలం తర్వాత అయినా ఇంధన ధరలు తగ్గుతాయో లేదో చూడాలి. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ తగ్గితే, భారత్ లో కూడా ధరలు తగ్గించి మాట నిలుపుకుంటారో లేదో తెలియాలంటే శీతాకాలం పోయే వరకు వేచి చూడాల్సిందే.

శీతాకాలం పోతే ధరలు తగ్గుతాయని చెప్పి, చేతులు దులుపుకోవడం కరెక్ట్ కాదని జనాలు అంటున్నారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ధరలు తగ్గించడం అదేమీ పెద్ద కష్టం కాదంటున్నారు. పెట్రోల్, డీజిల్ పై భారీగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు వసూలు చేస్తున్నాయని, ఆ ట్యాక్స్ లను కొంత తగ్గిస్తే..ఆటోమేటిక్ గా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని సూచిస్తున్నారు.