సాంప్రదాయానికి బ్రేక్ : మధ్యంతరం కాదు..పూర్తి బడ్జెట్

  • Published By: venkaiahnaidu ,Published On : January 30, 2019 / 07:46 AM IST
సాంప్రదాయానికి బ్రేక్  : మధ్యంతరం కాదు..పూర్తి బడ్జెట్

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మోడీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి-1న తాత్కాలిక ఆర్థికమంత్రి పియూష్ గోయల్ ప్రవేశపెట్టబోయే మధ్యంతర బడ్జెట్ లో కొన్ని మార్పులకు మోడీ సర్కార్ శ్రీకారం చుట్టనున్నట్లుగా తెలుస్తోంది. సాంప్రదాయానికి స్వస్తి పలికే దిశగా మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మధ్యంతర బడ్జెట్ కు బదులుగా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు మోడీ సర్కార్ సిద్ధమైనట్లు  కేంద్రప్రభుత్వంలోని ఉన్నతాధికారులు బుధవారం(జనవరి 30, 2019) తెలిపారు. రాబోయే ఎన్నికలు అత్యంత కీలకమైనవని, రైతులకు, మధ్యతరగతి ప్రజలకు, పేదలకు, ఉద్యోగులకు రాబోయే బడ్జెట్ లో వరాలు ప్రకటించే విషయంలో ఎట్టి పరిస్థితిల్లో వెనక్కు తగ్గకూడదని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

మధ్యంతర బడ్జెట్ ను ఓట్ ఆన్ అకౌంట్ అని కూడా పిలుస్తారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయి జులైలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే  ముందు పార్లమెంట్ లో ప్రస్తుత ప్రభుత్వం  ప్రవేశపెట్టే బడ్జెట్ ను ఓట్ ఆన్ అకౌంట్ లేదా మధ్యంతర బడ్జెట్ అని పిలుస్తారు. గతంలో ఓట్ ఆన్ అకౌంట్ ద్వారా ప్రభుత్వాలు కీలక వరాలు ప్రకటించినప్పటికీ తిరిగి ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అవి దోహదపడలేదు. పూర్తిస్థాయి బడ్జెట్ లానే మధ్యంతర బడ్జెట్ ఉండబోతుందని, ఏదైనా బడ్జెట్ అంటే పూర్తిస్థాయి బడ్జెట్ అని అర్థమని ఓ సీనియర్ బీజేపీ నేత ఒకరు తెలిపారు. మరోవైపు మధ్యంతర బడ్జెట్ ను బీజేపీ సొంత ప్రయోజనాలకు వాడుకుంటోందని కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్న సమయంలో బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగడం ప్రారంభించారు. గతంలో కాంగ్రెస్ నేతలు ఏ విధంగా వ్యవహరించారో దేశమంతా చూసిందని, తమను విమర్శించే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని ఆరోపిస్తున్నారు.

గతేడాది బడ్జెట్ లో రైతుల కోసం ..ఉత్పత్తి వ్యయం కంటే ఒకటిన్నర రెట్ల కనీస మద్దతు ధరను మోడీ ప్రకటించినప్పటికీ అది ప్రభావవంతంగా అమలుకు నోచుకోవడం లేదు. దీంతో ఈ బడ్జెట్ లోనే రైతులపై మోడీ వరాల జల్లు కురిపించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో మోడీ వైఖరిలో కాస్త మార్పు వచ్చినట్లుగా అర్థమవుతోంది. మరోవైపు రుణమాఫీ చేస్తాం, ప్రజలందరికీ కనీస ఆదాయం స్కీమ్ అంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని మోడీ తన మార్క్ బడ్జెట్ ద్వారా తిప్పికొట్టే అవకాశం ఏ మాత్రం లేకపోలేదు.